కొద్ది రోజుల ముందు ఏ పార్టీలను, కులాలను, మతాలను, సిద్దాంతాలను పక్కకు పెట్టి ముందుకువొచ్చాయో అనుకొన్న కమిటీలు పేకమేడల్లా కూలిపోయినాయి. ఇది నిజము. ఒక దశ దిశా లేకుండా అదృశ్య శక్తుల ప్రేరణతోనో ఉద్వేగంతోనో కదిలే, రగిలే కమిటీలుగా ఈరోజు మన ముందు ఉన్నాయి. ఈ కమిటీలు ఈరొజు సరిగా లేవని నిన్న గొప్పగా ఉన్నాయనేవాళ్ళు కొందరు. ఇవ్వాల వాటి స్వరూపం లక్ష్యమూ ఏమిటో నిన్న కూడా అదే అంతకు భిన్నంగా ఎలా ఉందగలదని అడిగేవాళ్ళు కొందరు.
అయితే తెలంగాణా అంశం ఒక్కటే కాకుండా తమ స్వార్థ ప్రయోజానాలకి వాడుకునేటట్టు మలచబడి కొద్ది రోజుల్లోనే పలచబడి చివరికి కొందరికి తొత్తులుగా ఏర్పడే స్థితికి వచ్చాయి. ఎక్కడ ఐక్యత కనపడితే అక్కడ చీలిక అనివార్యం, మరో శిబిరం, వారి వెనుక ఎవరి హస్తమో, ఎవరి ఆలోచనలో రాజ్యం ఏలుతు ఉంటాయి. చివరికి దానికి రక రకాల పేర్లు పెడతారు. ఒకరు రైట్ అంటే మరొకరు లెఫ్ట్ అంటారు, లేకపోతె పార్టీల , సిద్దాంతాల పరంగా, కులాల పరంగా విడిపోతుంటారు. ఎవరు ఎటుపోయినా కూడా ఎవరు ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తున్నారు అనేది ముఖ్యం. ఇప్పటి వరకు జరిగిన మోసాలను, వెన్నుపోట్లను సమీక్షించు కుంటూ , తెలంగాణను మోస పుచ్చిన పార్టీలకు దూరంగా ఉండడమనేది అవసరం. చేసిన తప్పులనే మళ్ళీ చేస్తూ పొతే మాత్రం మళ్ళీ మోసపోయినట్టే.
ఈసారి తెలంగాణ అన్న ప్రతి పార్టీనీ, దాన్ని సమర్థించే ప్రతి మేధావిని, సిద్ధాంతకర్తని ఆ పార్టీ స్పోక్స్ పర్సన్ ని , అ పార్టీకి అంకితమైన గాయకున్ని, రచయితని అడగాల్సిందే. ఓ అన్నా, ఓ అక్కా నువ్వు నిజంగా తెలంగాణ కోసమే చెప్తున్నావని, మాట్లాడుతున్నావని , పని చేస్తున్నావని నిన్ను ఎందుకు నమ్మాలే, ఎట్ల నమ్మమంటవు అని అడగాల్సిన సమయము వొచ్చింది. ఎవరు చెప్పలేదు తెలంగాణ కోసము ఎన్ని త్యాగాలైన చేస్తామని? ఎన్ని పార్టీలు ఇతర పార్టీలపై సవాళ్ళు విసరలేదు? ఎవరు నిజమైన తెలంగాణావాడు ఎవడు నకిలి నిజముగా పెద్ద గందరగోళమే. నమ్మిన వాడే గొంతుకోయడానికి ఎక్కువ అవకాశముంది. అదీ నిజమే.
తెలంగాణ వచ్చుడో ఒక నాయకుడు సచ్చుడో అన్న నాటినుండి ఏ పార్టీ ప్రత్యేక రాష్ట్రం ఇస్తుందా అని దేబురించక ఒక సారి ఉద్యమం ద్వారానే మన రాష్ట్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి అని అనుకొన్నాము. ఈ మధ్య తెలంగాణ నామస్మరణవల్లనే జనాన్ని మోసగించొచ్చని నెలలు కాదు సంవత్సరాలు ఇపుడు దశాబ్దాలుగా కూడా ఇలానే ఆటలాడుకోవచ్చు అనుకొనే పరిస్థితి మారిందనుకొన్నాము. రాజకీయ పార్టీలు కాదు ఈరోజు, ప్రజల చేతుల్లోకి ఎల్లి పోయింది తెలంగాణ అని టీ ఆర్ ఎస్ చిదంబరానికి ఈ మధ్య చెప్పినపుడు, అట్లైతే మీరెందుకొచ్చిండ్లు చేతులూపుకుంట అని ఎదురు ప్రశ్నించినపుడు జాక్లు ఇంకొద్దని, అన్ని రాజకీయ పార్టీలు నిర్ణయించుకొన్నై. నయాన బయాన జాక్ల దుకాణం మూసేయండని చెప్పాయి. ఉద్యమము మొదలయ్యింది.దగా కోరుల ఉద్యమం ఆగిపోయింది, నిజమైన తెలంగాణా ప్రజల గొంతును అనచివేయబడే ప్రయత్నం జరుగుతుంది. అయినా కొద్దిమంది, కొన్ని కొత్త గా ఏర్పడే జాక్ లైనా సరే , విడిపోయి మిగిలిన జాక్ లైనా , నిస్వార్థం గా ప్రజల కోసం, తెలంగాణా కోసం పరి తపిస్తూనే ఉన్నాయి. అయితే ఈ చీలికలు ఎలా, ఎవరి సైగలతో జరుగుతుంది ? ఇలా జరిగేలా జాక్లెందుకు ఒప్పుకొన్నాయి అనేవి లోతుగా ఆలొంచించాలి.
ఇప్పటి వరకు విద్యార్తుల ద్వారానే ఉద్యమం ఎంతోకొంత ముందుకు పోయిందనేది వాస్తవం. అదే విద్యార్ధులని మన రాజకీయ పార్టిలు జలగాల్లగా పట్టి పీడిస్తూ వారిని ఎన్ని రకాలుగా ప్రలోభ పెట్టాలో అన్నిరకాలుగా ప్రయత్నిస్తూ తమకు అనుకూలంగా మలచుకుంటున్నాయి. స్వచ్చందంగా తమ భవిష్యత్తు కోసం, తెలంగాణా ప్రజల బాగు కోసం, నాలుగు కోట్ల ప్రజల విముక్తి కోసం విద్యార్తులు ఉద్యమాలు చేస్తుంటే వారిని విడగొట్టడం ఎంతవరకు సబబు? ఇలా విడగొట్టే వారికి ఏది శిక్ష? దీనిని ద్రోహం అనాల లేక తమ తమ అస్తిత్వాలని కాపాడుకోవాడానికి డివైడ్ అండ్ రూల్ సిద్ధాంతాన్ని, తెలంగాణా ఉద్యామాన్ని కూడా ఫణంగా పెట్టి తమ అసలు స్వరూపాలని బయట పెట్టుకుంటున్నారు అని అనుకోవాలా, ఎలాగయినా అర్థం చేసుకోవచ్చు.
ఎవరు అవునన్నా, కాదన్నా రాజకీయ పార్టీలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కొరకు, ప్రజా సమస్యల పై ఉద్యమాలు చేయవు అన్నది వాస్తవం, వారికి పార్టీల అజెండా తప్పితే ప్రజల గురించి, వారి సమస్యల గురించి పట్టించుకున్న పాపాన ఏనాడు పోలేదు. నిజంగా రాజకీయ పార్టీలు తెలంగాణా సమస్యలు పట్టించుకొని ఉంటె ఇవాళ పరిస్థితి ఇంత దౌర్భాగ్యంగా ఉండేది కాదు. తెలంగాణ ప్రజలను ఆంధ్రా దోపిడిదార్ల కుట్రలకు, పథకాలకు, ప్రాజెక్టులకు బలిచేస్తుంటే పెదవి విప్పని తెలంగాణ నాయకులు విద్యావంతులు మొన్న డిసంబరు నుంచి మార్చి మధ్య ఇది బాగుంది అది బాగలేదని విపరీతంగ బాధపడుతున్నరు. ఎందుకూ ఇంత సడనుగా పెరిగిన తెలంగాణ ఉత్సాహమని ఎవరికైనా సందేహం రాక మానదు.
రోజుకో మాట మాట్లాడే హక్కు తమకే ఉన్నదనీ, రోజుకొకరితో పొత్తుపెట్టుకొని ఇంకొకరితో విడిపోయి గందరగోళం చేసే హక్కు తమకే ఉన్నదనీ, త్యాగాలెన్నైనా చేస్తామని అమయాక పిల్లలను రెచ్చగొట్టిన పార్టీలన్ని, ప్రాణాలను కాదుగదా పదవులను సైతం వదులుకోలేక దొంగ రాజీనామాలివ్వటం కూడ తమకే చెల్లునని, పది సార్లు నిలదీస్తే తప్ప ఒకసారి చెల్లే రాజీనామాలు ఇవ్వలేని పార్టీలు మళ్ళీ వోట్లబేరానికి వొస్తున్నయి. మేమంటే మేము నిజమైన తెలంగాణ పార్టీలమని గుండెలు బాదు కొంటున్నాయి.
తెలంగాణ ప్రజలను నట్టేటా ముంచినా, మేమంటే మేము ఇంకొకడికంటే ఎక్కువ జపం చేసామని పోటీపడుతున్నరు. పైగా ఇలాంటి రాజకీయ పార్టీలను గెలిపించుకునే బాద్యత మాత్రం మల్లొకసారి ప్రజలదే అంటున్నారు. చరిత్ర ఎపుడూ పునరావృతం అవుతూనే ఉన్నది, ప్రజలు ఎప్పుడు మోసపోతూనే ఉన్నారు. మనం మాత్రం ప్రేక్షక పాత్ర వహిస్తూనే ఉన్నాము. వాస్తవాలను చెపితే మనకు అనేక రకాలుగా పేర్లు పెడుతుంటారు. అయినా కూడా మన బాద్యత విస్మరించకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడు తూనే ఉన్నాము.
విద్యార్థులను చెడగొడుతున్న వారెవరైనా (టీ ఆర్ ఎస్ గాని ఇంకే పార్టీ ఐనాగానీ), ఉద్యమాన్ని మోసపుచ్చుతున్నరనే అనుకోవాలి, ఉద్యమాన్ని తమ అవసరాల కోసం తమ లావాదేవీల కోసం పెంచడము అవసరం తీరిందనుకొంటే చల్లార్చడము. ఇట్లా చేయడము నేరమనే చెప్పాలి. ఇవి నేటి ఉద్యమంలో ఉన్న విషయాలు, వాస్తవాలూ. డబ్బు సంచులని, పదవులని ఎరగా చూపుతూ ఉద్యమ స్పూర్తిని ప్రక్క దారి పట్టిస్తున్న వారిని మాత్రం ఎట్టి పరిస్తితిలోనూ క్షమించడానికి వీలు లేదు. నిన్న ప్రళయం సృష్టిస్తామని నేడు మౌనమైపోయి మల్లొకసారి వోట్ల ఫక్కీలోకి తిరిగి వస్తున్నామనే వాళ్ళకు బుద్ది చెప్పాల్సిందే. ఇక్కడ యుద్ధం జరుగుతుంది, ఆత్మ గౌరవ పోరాటాలు జరుగుతున్నాయి. నీతికి అవినీతికి మధ్య, అణచివేతకి వ్యతిరేకంగా, అన్యాయానికి వ్యతిరేకంగా ప్రాణాలు కూడా లెక్ఖ చేయకుండా త్యాగాలతో ఉద్యమం నడుస్తుంది. శత్రువు ఎవరో తెలియకుండా ముందుకు పోలేము.ఏది తెలుసుకోకుండా , అమాయకంగా చీకట్లో బాణాలు వేయలేము, మరిన్ని ప్రాణాలు , ఆశలు, కోరికలు బలి పెట్ట లేము.
ఈ సారి జరిగిన ఉద్యమంలో అసువులు బాసిన వాళ్ళంతా ఈ మోసాలకి బలి అయినా వాళ్ళే. ఇవన్నీ రాజకియ హత్యలే. ఇందులో ఎ పార్టీకి ఎంత వాటా ఉందనేది విజ్ఞులు తేల్చాలి. ఈ హత్యలు ఆగాల్సిందే, ఈ విషయాలు చర్చించాల్సిందే. తెలంగాణ రాజకీయాలు భవిస్యత్తు పట్ల నమ్మకాన్ని కాక నిరాశను , నిస్సహాయతను పెంచేదిగానున్న దౌర్భాగ్య పరిస్థ్తినుంచి దిశ మరాల్సిందే. ఈ ఆత్మహత్యల పరంపర ఇక కొనసాగొద్దు అని అనుకొనే ప్రతిఒక్కరు నేటి రాజకీయాల నిజాయితిని నిబద్దతనీ ప్రశ్నించాలి. అలాకాక ఇప్పుడు మనం స్వార్థరాజకీయ నాయకులకు తలవంచితే ఇన్ని చావులను అవమాన పరచడమే అవుతుంది. ఇప్పుడున్నవన్ని బూర్జువా పార్టీలు, ప్రజల క్షేమం కోరే ఒక్క పార్టి కూడా లేదు. ఏ రాయి అయితే ఏముంది, ఏ పార్టి అయితే ఏముంది, ఏ నాయకుడు అయితే ఏముంది, ప్రజలకు ఒరిగింది మాత్రం శూన్యం.
ఆత్మహత్యలు ఆపాలన్నా, తెలంగాణా సాధించాలన్నా, ఇప్పటికైనా, మనమందరం ఇష్టమున్నా లేకున్నా ద్రోహులను ద్రోహుల్లాగా ప్రకటించి, ప్రజల పక్షాన నిలబడడం, ఉద్యమాన్ని బలోపేతం చేయడం ఒక్కటే మనముందున్న కర్తవ్యమ్. ఏదో ఒకటి అన్నాదులే మనకోసము అని ప్రతి అవకాశవాదిని క్షమించు కుంటూ పొతే, మనల్ని మనం మోసం చేసుకుంటూ మరోసారి దగాపడ్డ ప్రజలని, తెలంగాణని చూస్తూ మౌనంగా ఉండి పోవడమే. 'నువ్వు అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడాక పొతే, తప్పకుండా అన్యాన్ని చేసే వాడివవుతావు' అన్న మాటలను మనం మరచి పోకూడదు.
ఒక్కసారి ఆలోచించడి, మనం ప్రజల వైపా? పార్టీల వైపా ? మన నిర్ణయాలే ఉద్యామానికి బలం. మన న్యాయ బద్దమైన ఆలోచనలే మనకు గెలుపుకు దారి చూపిస్తాయి. ఇపుడొక ప్రత్యామ్నాయం అవసరం. . ఆచరించే ఆచరణాత్మక మాటలతో మాత్రమె ప్రజలకు పనికొచ్చే నిజమైన ప్రజాస్వామిక తెలంగాణాని సాధించు కోవచ్చు.
No comments:
Post a Comment