Monday, August 9, 2010

ఉద్యమం నీరు గారుతుంది

ఉద్యమం నీరు గారుతుంది అని ఒకడు, తెలంగాణా వాళ్ళు సల్లబడ్డారు అని ఇంకోడు
ఎవనికి ఇష్టం వచ్చినట్టు వాడు చెప్పుకుంటుంటే మరి మనం ఏమి చేద్దాం.
మనం ఎందుకు సప్పుడు జేస్తలేమో, ఎందుకు ఇంకా ఓపిక పట్టుకొని కూసున్నామో ఈ
మొండి వెధవలకు అర్థం అయితలేదు. ఇంకా ఎక్కేడెక్కడో వేలు పెట్టి గెలికి మరీ
కొట్లాటకు దిగుతున్నారు. వాడు అలా గెలికాడు కదా అని మరి మనం ఏమి
చేద్దాం.
ధరలు పెరిగాయని, కరెంటు కోతలని అదని, ఇదని ఏవేవో ఎప్పుడూ ఉండే సమస్యలను
ఎత్తి చూపుతూ ధర్నాలు, రాస్తా రోకోలు చేస్తున్నారు కొందరు. మరి ఆ
కొందరిలో మన వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇదంతా తెలంగాణ ఉద్యమాన్ని తోవ
మళ్ళించే వేరే సమస్యల మీద, ఏ ప్రాంతం ప్రజలు అయిన మాకు లేదు ఈ సమస్య అని
చెప్పలేని సమస్యల మీద ఒత్తిడి పెంచి మన ఉద్యమంలోకి నీల్లోదిలే ఈ
ప్రయత్నానికి మరి మనం ఎలా స్పందిద్దాం.
ఇలా చెప్పుకుంట పోతే రోజుకో కొత్త విషయం తో... వాడు ఎవడో గంగడోలు
నిమిరితే తల ఆడించే బసవన్నల లాగ మన నాయకులూ కూడా అన్ని మరిచి పోలో అని
ఫాలో అయిపోతున్నారు. మరి మన యువ లోకం కూడానా..?

వేరే గ్రూపులల్ల కూడా ఇదే మాట్లాడుకుంటున్నారు... మన ఉద్యమం ఏమైంది అని.
ఆలోచించండి... మన ఉద్యమం యాడికి పోలేదు. మనలోనే ఉంది. మన పనులలోనే ఉంది.
మన మాటలలోనే ఉంది. ఏమి మాట్లాడుతున్నామో, ఏమి చదువుతున్నామో, ఏమి
రాస్తున్నామో, ఏమి చూస్తున్నామో, ఇవన్ని ఉద్యమానికి దోహద పడతాయి. రాస్తా
రోకోలు, ధర్నాలు, నిరాహార దీక్షలు, అసెంబ్లీ ముట్టడీలు.. ఇవే కాదు కాదా
మన ఉద్యమం లో భాగాలూ. మన పోరాటం అన్నిటిలో.
ఒక పది మందిలో ఒకనికన్నా వాని ఉనికిని, ఉద్యమానికి వాడు తోడ్పడే ఆలోచనను
రేకెత్తించ గలిగితే అది కూడా ఉద్యమ భాగమే. చదువు ఆపేసిన ఒక తమ్మున్ని,
చెల్లెలిని చదువుకోమని ప్రేరేపించడం, ఉద్యోగం చెయ్యలేకో, రాకో, చేసే
సామర్థ్యం లేకనో ఉన్న వాళ్ళను ఇంకా వేరే ఉపాది మీద ద్రుష్టి పెట్టేలా
ఆలోచింప జేసినా ఉద్యమ భాగమే. ఉద్యోగం చెయ్యగలిగిన అర్హత కలిగినా, అవకాశం
దొరకని వాళ్ళకు నీకు తెలిసిన చోట ఉద్యోగం ఇప్పియ్యడం లేదా, ఆ ఉద్యోగానికి
తోడ్పడే సహాయం చెయ్యడం కూడా మన తెలంగాణ తమ్ముల చెల్లెళ్ళ జీవితానికి ఒక
దారి చూపిన వాడివి అవుతావు. ఆ దారే దొరకక మన పెద్దలు చెయ్యలేదు.
చదువుకుని ఏదో విదంగా నీ జీవితానికి దారి చూపుకున్న వాడివి, ఇంకో మనిషి
కి సహాయం చెయ్యడంలో కూడా నీ ఉద్యమ స్పూర్తిని చాటుకొవచ్చు.

ఆలోచించండి... ఇంకేమి చెయ్యగలవో... మన ప్రాంతం మనకు దక్కినా... రేపు
పొద్దున్న ఇలాంటి రాజకీయ నాయకులే మల్ల తయారయితే, ఇలాంటి ప్రభుత్వ
ఆఫీసర్లు మల్ల పుట్టుకొస్తే.. అప్పుడేం చేస్తావు... అప్పుడు మల్ల ఉద్యమం
మొదలు పెడతావ... లేక ఇప్పుడున్న ఉద్యమం తో పాటు వాటిని కూడా సాధ్యమైనంత
వరకు తొలగించుకునేందుకు ప్రయత్నిస్తావా... లేక ముందు మన తెలంగాణ రాని ఆ
తర్వాత అలోచిస్త అంటావా...

ఒక సామాజిక చెడును రూపు మాపనీకే ఈ సమయం ఆ సమయం అంటూ ఏది లేదనుకుంట
నేనైతే. ప్రతి దినం మన చేసే నిత్య కార్యాలలో మన తెలంగాణ రాష్ట్ర సాధనకు,
దాని ఉద్దరణకు ఉపయోగ పడే ఎన్నో పనులు మనకు కనిపియ్యొచ్చు. దయచేసి వాటిని
విస్మరించకండి. నీకు తోచిన మంచి, చేతనైతే ఒక అడుగు ముందుకేసే ప్రయత్నం
చెయ్యండి. ఇదంతా కూడా మన ఉద్యమం లో భాగమే.

జై తెలంగాణ జై జై తెలంగాణ
శ్రీనివాస్ రెడ్డి కొంపల్లి

No comments:

Post a Comment