
బతుకమ్మ పాట, సాగవలసిన బాటప్రాణహిత బతుకమ్మ తెలంగాణకు సంకేతం. బతుకును అమ్మగా సంభావించి, పూలలో, ఆకులలో, నీటిలో, ప్రకృతిలో ఆమెను దర్శించి తొమ్మిదిరోజులపాటు ఆటపాటలతో కొలవడం తెలంగాణలో మాత్రమే ఉన్న సంప్రదాయం. బతుకమ్మ పాటలలో సామూహిక గానం ఉంది. సంగీతం ఉంది. నృత్యం ఉంది. జీవితం ఉంది. ఆ పాటలలో తెలంగాణ స్త్రీలు తమ బతుకులను పాడుకుంటారు, తమ ఆనందాలనూ విషాదాలనూ పాడుకుంటారు, ఏడేడు తరాల కథలనూ గాథలనూ తవ్విపోసుకుంటారు. కుటుంబంలోని దుఃఖాన్నీ, పాలనలోని కష్టాల్నీ, ప్రకృతి వైపరీత్యపు కడగండ్లనూ సామూహికంగా పాడుకుంటారు. కుటుంబ జీవనంలోని సంతోషాన్నీ, పిల్లల ముద్దుముచ్చట్లనూ, పంటచేల వయ్యారాలనూ, వీరుల త్యాగాలనూ, దేవతల దయనూ, శృంగారాన్నీ, కరుణనూ, హాస్యాన్నీ బతుకమ్మ పాటలలో కలగలిపి తలపోసుకుంటారు, వలపోసుకుంటారు. మరిచిపోయిన అనుబంధాలయినా, మరవలేని సంబంధాలయినా, అప్పటికప్పుడు ప్రతీకారంతీర్చుకోలేని కోపాలయినా, వ్యంగ్యంగా వెలువడే అధిక్షేపమయినా, ఎప్పటికప్పుడు ప్రేరణగానిలిచే యోధుల జ్ఞాపకాలయినా బతుకమ్మ పాటలకెక్కవలసిందే. వందల ఏండ్ల వెనుకటి సమ్మక్క సారలమ్మ వీరగాథ అయినా, నిన్నమొన్నటి ఐలమ్మ సాహసం అయినా, కళ్లముందరి నెత్తుటి కాల్వల సజీవ కవోష్ణ స్మృతులయినా బతుకమ్మ పాటలకెక్కవలసిందే.
No comments:
Post a Comment