Sunday, September 19, 2010

ఎకరాకు 60 బస్తాలు

ఎకరాకు 60 బస్తాలు
'శ్రీ' సాగుతో సాధించిన సుగుణమ్మ
అమెరికాకు పాకిన ప్రతిభ
తమ దేశానికి రావాలని ఆహ్వానం
సన్మానించిన పొన్నాల, రఘువీరా
హైదరాబాద్, సెప్టెంబర్్ 8 : ఎకరా పొలంలో ఎన్ని బస్తాల వరి పండించొచ్చు? అత్యాధునిక పద్ధతులు, సంరక్షణ విధానాలు అవలంబిస్తే ఏ మాత్రం దిగుబడి రాచొచ్చు? 20..25..బాగా పండితే 30 బస్తాలు. కానీ అంతకు రెట్టింపు పంటను కూడా సాధ్యం చేసి చూపారు ఓరుగల్లుకు చెందిన ఓ మహిళా రైతు. అంతేకాదు ఈ విషయాన్ని తెలుసుకొని అమెరికా కూడా ఆశ్చర్యపోయింది. తమ దేశానికి వచ్చి రైతులకు ఆ రహస్యమేమిటో చెప్పాలని ఆహ్వానం పంపింది.

వరంగల్ జిల్లా జనగాంలోని కట్కూరు గ్రామానికి చెందిన సుగుణమ్మకు కనీసం సొంతభూమి కూడా లేదు. రెండెకరాల భూమిని కౌలుకు తీసుకొని మూడేళ్ల నుంచి శ్రీ పద్ధతిలో వరిని పండిస్తున్నారు. ఎకరాకు 60 బస్తాలకు పైగా దిగుబడిని సాధించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న అమెరికా ప్రభుత్వం తమ దేశానికి రావాలని ఆహ్వానం పంపింది. తమ రైతులకు దీనిపై అవగాహన కల్పించాలని కోరింది. వ్యవసాయ పరిశోధనా సంస్థ ఇక్రిశాట్ త్వరలో ఆమెను అమెరికా తీసుకెళ్లనుంది.

ఈ నేపథ్యంలో సుగుణమ్మ బుధవారం సచివాలయానికి వచ్చారు. వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి పొన్నాల లక్ష్మయ్య, వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరా రెడ్డిని ఆమె కలిశారు. శ్రీసాగు విధానాన్ని వివరించారు. 'క్రాప్స్' స్వచ్ఛంద సంస్థ, ఇక్రిశాట్, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల సహకారంతోనే తాను 'శ్రీ' పద్ధతిలో విజయం సాధించానని సుగుణమ్మ వెల్లడించారు.

ఆమె స్ఫూర్తి రాష్ట్రంలోని మెట్ట ప్రాంత రైతులకు ఆదర్శం కావాలని మంత్రులు కొనియాడారు. ఈ సందర్భంగా వారు సుగుణమ్మను శాలువా కప్పి సత్కరించారు. తన సొంత గ్రామానికి చెందిన సుగుణమ్మకు వ్యక్తిగతంగా రూ.50 వేల నగదును ఇస్తున్నట్లు పొన్నాల ప్రకటించారు

No comments:

Post a Comment