Sunday, March 28, 2010

జయజయహే తెలంగాణ జననీ జయకేతనం

జయజయహే తెలంగాణ జననీ జయకేతనం


ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం

జయ…

తరతరాల చరితగల తల్లీ నీరాజనం


తర…
పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం

జై తెలంగాణ జై జై తెలంగాణ

జై…
పోతనదీ పురిటిగడ్డ రుద్రమదీ వీరగడ్డ

గండర గండడు కొమురం భీముడేలే బిడ్డ

కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప

గోలుకొండ నవాబుల గొప్పవెలుగె చార్మినార్

జై…

జానపదా జనజీవన జావళీలు జాలువార

కవిగాయక వైతాళిక కళలా మంజీరాలు

జాతిని జాగృతపరచే గీతాలా జనజాతర

అనునిత్యం నీ గానం అమ్మ నీవె మాప్రాణం
జై…
సిరివెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం

అణువణువున ఖనిజాలే నీ తనువుకు సింగారం

సహజమైన వనసంపద సక్కనైన పూవులపొద

సిరులుపండె సారమున్న మాగాణియె కద నీ ఎద
జై…
గోదావరి కృష్ణమ్మలు మన బీళ్ళకు మళ్ళాలి

పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలి

సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగ ఉండాలె

స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి

జై…