పాదపాదాన పరిపరి దండాలు..
చాకలి శ్రీనివాస్ గెలిచాడు. ధర్మపురి శ్రీనివాస్ ఓడిపొయ్యాడు. ఉప ఎన్నికల్లో చాకలి శ్రీనివాస్ అభ్యర్థికాడు. ఇప్పుడు తన గెలుపును తాను ఆస్వాదించడానికి ఈ భూమ్మీద కూడా లేడు. మరణానంతర మెరుపు నక్షత్రం అతను. తెలంగా ణ కోసం విరిసిన తార అతను. డీ.శ్రీనివాస్ అనే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునికి చాకలి శ్రీనివాస్ ప్రత్యర్థీ కాడు.
కానీ డీ. శ్రీనివాస్ మందూ, మార్బలాన్ని, నోట్లకట్టలను, రెండుముఖాలను, ఆడి తప్పిన అబద్ధాల పుట్టను..మొత్తంగా ఎలక్షనీరింగ్ అనే సవాలక్ష అక్రమాల గనులను బద్దలు కొట్టి గెలిచాడు చాకలి శ్రీనివాస్. వరంగల్‌లో మిర్యాల్‌కార్ సునీల్‌కుమార్ గెలిచాడు. అతనొక జర్నలిస్టు. తెలంగాణ కోసం నిలువునా ప్రాణం తీసుకున్నా డు సునీల్. రాయరాని, రాయలేని, రాయజాలని వార్తల కోసం మరణించిన సునీల్ గెలిచాడు.
అతని ఆత్మ మళ్లీ ఒకసారి వరంగల్ జిల్లా మీద తెలంగాణ మనసుగా.. ఏకాత్మగా వెలుగుతున్న ది. పేర్లెందుకు? ఒక శ్రీకాంతాచారి, ఒక యాదయ్య, ఒక సాయికుమార్ మీగడ, ఒక సవేరా బేగమ్.. శిల్పాల మీద చెక్కాల్సిన నాలుగువందల మంది పైబడిన తెలంగాణ ఆకాంక్షలు వాళ్లు.. మరణానంతర విజయ సోపానాలు వాళ్లు.. ఎన్నికల విజయా లు.. మన దేశపు భ్రష్టుపట్టిన 'ఎలక్షనీరింగ్ ప్రలోభాల వల్ల కురచవి. తాత్కాలికమైనవి. అంతిమ పరిష్కారాల సాధనలో ఉపయోగపడనివి.
అలాంటి కురచ విజయాలను మహా శిఖరంలా మలిచిన వాళ్లు తెలంగాణ ప్రజలు. ఏమివ్వగలం..వారికి.. తెలంగాణ తప్ప. ఒక భ్రష్టుపట్టిన ఎన్నికల రూపాన్ని కూడా టీఆర్ఎస్, బీజేపీ దుమ్మురేపడానికి.. కాంగ్రెస్, టీడీపీ దిమ్మ తిరగడానికి అస్త్రంగా మలుచుకున్నారు తెలంగాణ ప్రజ. ఏకాత్మను అంగీకరిస్తామా? లేదా? అవునిది ఏకాత్మే.. హూ ఈజ్ అరవిందరెడ్డి.. తెలంగాణ తేల్చుకు రమ్మని, సైరనూది సమర రంగాన కదను తొక్కకముందు.. అరవిందరెడ్డి టీఆర్ఎస్‌తో గొడవలో ఉన్నాడు.. కేసీఆర్ అతనికి ద్రోహిగా కనబడ్డాడు. వై.ఎస్. దేవుడి గా దర్శనమిచ్చాడు.
ఇవ్వాళ అరవిందరెడ్డి మెజారిటీ డెబ్భైఏడు వేలా.. ఎవరు గెలిచారు. మంచిర్యాల్ గెలిచింది. మంచిర్యాల్ నిలిచింది. చరిత్రను తిరగరాస్తున్నది తెలంగాణ. ఒక ముసల్మా ను కాషాయ వర్ణపు భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకొని జైతెలంగాణ అంటూ యెండల లక్ష్మీనారాయణ గెలుపు కోసం దూలాడినట్టు.. దుంకినట్టు ఎగరడం ఊహించగలరా? నిజామాబాద్ విజయగర్వం చూడండి. దేనికి సూచన ఇది. మతం లేదు. కులం లేదు. నోట్ల కట్టలు లేవు. మందు లేదు. బ్రాందీ లేదు. వాగ్దానం లేదు.
వాగాడంబరం లేదు. ఐసు ఐసు పథకాలు లేవు. నైసునైసు మాటలు లేవు. ఒకటే ఉనికిలో ఉంది. ప్రజల మనసు ల్లో.. లోపలి పొరల్లో.. ఇంకిపోయింది తెలంగాణ. పాతుకున్నది తెలంగాణ. కొప్పుల ఈశ్వరా? కావేటి సమ్మయ్యా.. చెన్నమనేని రమేశా? కల్వకుంట్ల తారకరామారావా? తన్నీరు హరీష్‌రావా? వినయ్‌భాస్కరా? ఈటెల రాజేందరా? ఏనుగు రవీందర్‌రెడ్డా? నల్లాల ఓదెలా? ఎవరైతేనేం విజయానికి ఒక ప్రతిమ కావాలి. విజయానికి ఒక రూపు కావాలి. విజయానికి ఒక పేరు కావాలి.
నిజమే హరీష్ హుర్రే.. హుర్రే.. తొంభైయిదు వేల మెజారిటీ. అదీ చరిత్రే. అతను, ఈటెల రాజేందర్ మంచి ఎమ్మెల్యేలు కూడా కావొచ్చు. అయినా మరీ అంత ఏకపక్షం ఎలా సాధ్యం.. నాలుగు వందల మంది అమరవీరుల బలిదానాలకు అంకితమిచ్చిన హరీష్‌రావు, ఈటెలల విజయం తెలంగాణ ప్రజల విజ యం. చనిపోయిన వారి ఆత్మలు మేల్కొనడమంటే ఇదే.. వాళ్ల ఆత్మలు ఆకాంక్షలై ప్రతిఫలించడమంటే ఇదే.. నలుగురు వెలమదొరలు ఒకేవాహనం మీద ఎక్కి ఎములాడల, సిరిసిల్లల తిరిగి ఎన్నికల ప్రచారంల మాట్లాడి నిలిచి.. గెలవడం ఎట్లాసాధ్యం.
అది సిరిసిల్ల.. అది జగిత్యాల. అయినా సాధ్యమే. తెలంగాణకు ఇప్పుడు ఏ ఎజెండా లేదు. ఒకే ఎజెండా.. విద్యాసాగర్‌రావు, రమేష్‌రావు, తారకరామారావు, చంద్రశేఖర్‌రావు ఎవరైతేనేం? వాళ్లే తెలంగాణ ఆత్మలను ఆవాహన చేసినంత కాలం గెలుస్తా రు. మరో మాట లేదు. ఉన్నదొకటే ఎజెండా? దొరలు .. తర్వా త.. ముందు మా తెలంగాణ మాగ్గావాలె.
మతం తర్వాత మా తెలంగాణ మాగ్గావాలె. కులం తర్వాత మా తెలంగాణ మాగ్గావాలె.. యథా ప్రజ .. తథా రాజ.. రాజులారా! ఇక తెలంగాణల ఇదే నిజం.. ప్రజలున్నట్టు మీరుంటేనే భూమ్మీద మీకు నూకలు..లేదంటే మీకు నూకలు చెల్లు.. నిజమే సర్వ అవలక్షణాలనూ తెలంగాణ ఓడించింది. బాబ్లీ ఎందుకంటావో? తెలుసు.. బాబ్లీ వెనువెంటనే మీరు తెచ్చిన తెలుగు జాతి ఆత్మగౌరవం ఎంత ప్రమాదకర నినాదమో తెలుసు. ఇరవై ఎనిమిది ఏండ్ల క్రితానికి, ఎన్టీఆర్ కాలానికి వెళ్లడానికి సిద్ధంగా లేదు తెలంగాణ.
ఆత్మగౌర వం ఒకమాయ. అదొక అబద్ధం. నిజమే బాబ్లీ అన్యాయమే కావ చ్చు.. కానీ ఆ తర్వాతి తెలుగుజాతి ఆత్మగౌరవం తెలంగాణ గౌర వం పీకనొక్కి న క్రితం ఒక చేదు జ్ఞాపకం. ఎంత విజ్ఞత తెలంగాణది. తెలుగుజాతి ఆత్మగౌరవ అసలు అంతరంగ స్వభావాన్ని బీజరూపంలో పసిగట్టిన సిస్మొగ్రాఫ్ తెలంగాణ. ఇప్పుడు అది రాబోయే పెను ముప్పును కనిపెట్టగలదు. రెండు కళ్ళ సిద్ధాంత కర్తల అసలు దృష్టినీ, అవతారాన్నీ కనిపెట్టగలదు. డిపాజిట్లు గల్లంతవుతాయి జాగ్రత్త.. ఇక చెల్లదు.
ఇది గుర్రం ఇది మైదానం. అటా.. ఇటా.. ? ఎటో ఒక దిక్కే.. తొమ్మిదో తారీ ఖు గీటురాయి. నువ్వేం మాట్లాడ్తున్నావో? బాబ్లీ అనంతర ఆత్మగౌరవం ఎవరిదో .. పసిగట్టింది తెలంగాణ. డీ. శ్రీనివాస్ బంగా రు పళ్లాన్ని నమ్మలేదు తెలంగాణ.. చెన్నారెడ్డి బంగారు పళ్లెంలో పెట్టి మున్నూటా డెబ్భై మంది తలలను ఇందిరాగాంధీకి సమర్పించిన ద్రోహం.. ఎక్కడ మళ్లీ ప్రారంభమవుతున్నదో పసిగట్టింది తెలంగాణ. మహా ఉద్యమ అనంతరం ..మహా ఊరేగింపుల అనంతరం.. మహా జనసాగరాల అనంతరం.. ఒకే ఒక్క మాట.
తెలంగాణ. నిజమే.. తెలంగాణ కోసం మరణించిన ఒక కొడుకు కోసం పరితపించే ఒక తల్లికి ఈ విజయాల పూలహారం. ఆ అమ్మకిప్పుడు నాలుగు కోట్ల మంది కొడుకులు, కూతుళ్లు. తెలంగాణ కోసం వాళ్లు నిలబడ్తున్నారు. ఇస్తమని ఇవ్వరు. తెస్తమని తేరు. శవాల మీద పడి ఏడ్చిన వాళ్ళు కన్నీరు ఇంకక ముందే కల్లబొల్లి కబుర్ల కాకారాయుళ్లవుతరు. అందుకే.. బహు పరాక్.. బానిసకొక బానిసకొక.. బానిసలోయి బానిసలయిన తెలంగాణ ప్రియనేతలా రా! కాంగ్రెస్ మసిబూసి మారేడు కాయ చేస్తే.. ఇచ్చిన మాట తప్పితే బండకేసి కొడ్తది తెలంగాణ.
రెండు కండ్లు..మూడు నాల్కలు.. ఐదు ముఖాలు.. ఆరు ఆత్మగౌరవాలు చెల్లవు గాక చెల్లవు.. తెలుసుకోండి..మేల్కొన్నది తెలంగాణ.. నిజమే.. పన్నెండు సీట్లతో తెలంగాణ రాదు. మరో పన్నెండు సీట్లతో రాదూ పోదు. కానీ.. చరిత్ర నిండా.. కాలం నిండా.. తెలంగాణ ప్రతి మలుపులోనూ.. ప్రతి సందర్భంలోనూ.. తెగేసి చెబుతున్న ది.
నిలేసి అడుగుతున్నది. నీళ్లు నమలకు.. మరో మాట లేదు. ఇది తెలంగాణ ప్రజల విజయం. నిలబడి, కలెబడి నిలిచి గెలిచిన తెలంగాణ రేపటి పొద్దు తెలంగాణలోనే.. లేదా.. బానిస నేతలకు పుట్టగతులు లేవు.. మరి రావు.. మరోసారి.. మరోసారి. ఈ గడ్డమీద పుట్టిన ప్రజలకు.. ఈ గడ్డ కోసం ప్రాణాలను తృణప్రా యం చేసుకున్న వీరులకు ... వినమ్రంగా పాదపాదాన.. పరిపరి దండాలతో... హేల్ తెలంగాణ.. హేల్.. తెలంగాణ పీపుల్..