Thursday, September 23, 2010

కేసీఆర్ వ్యాఖ్యలతో ఉద్యమానికి నష్టమే !: తెలంగాణ జేఏసీ

హైదరాబాద్, సెప్టెంబర్ 21 : స్థానికతపై టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఉద్యమానికి నష్టమేనని తెలంగాణ జేఏసీ భావిస్తోంది. మంగళవారం ఇక్కడ తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం అధ్యక్షతన ఆయన నివాసంలో జరిగిన స్టీరింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న జేఏసీ భాగస్వామ్య పక్షాల ప్రతినిధులు..ఏ దశలోనూ కేసీఆర్ వ్యాఖ్యలను అంగీకరించలేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం..తెలంగాణ ఉద్యమానికే కాకుండా, ఇక్కడి ప్రజలకు కేసీఆర్ వ్యాఖ్యల వల్ల నష్టం కలుగుతుందని వారు అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని ఆయనకు తెలియజెప్పాలని నిర్ణయించారు.

ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో నాయకత్వ బాధ్యతల్లో ఉన్న వారు పూర్తి సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని, ఉద్యమకారుల మనసు నొప్పించే విధంగా వ్యాఖ్యలు చేయకూడదని అభిప్రాయపడ్డారు. స్థానికులు ఎవరు ? స్థానికేతరులు ఎవరు ? అనే విషయాన్ని శాస్త్రీయంగా నిర్ధారించాలని అభిప్రాయపడ్డారు. ముల్కీ నిబంధనల అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని తీర్మానించారు. అయితే కేసీఆర్ వ్యాఖ్యలు తరహా పరిణామాలు చోటుచేసుకున్న సందర్భంలో తెలంగాణ వాదులు పరస్పరం విమర్శలకు దిగవద్దని భావించారు.

ఉద్యమంలో పాల్గొంటున్న ఉద్యోగులపై వేధింపులను ప్రభుత్వం ఆపకపోతే క్షేత్ర స్థాయి నుంచి ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు, జేఏసీ నేత వి.శ్రీనివాస్‌గౌడ్‌కు అందిన బదిలీ ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని కోరుతూ సీఎం రోశయ్యను కలవాలని, అయినప్పటికీ ప్రయోజనం లేకపోతే తదుపరి కార్యాచరణ చేపట్టాలని తీర్మానించారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ఇవ్వనున్న నివేదికపై (అనుకూలమైనా..వ్యతిరేకమైనా) తెలంగాణ జేఏసీకి ఒక ముందస్తు ప్రణాళిక ఉండాలని నిర్ణయించారు.

దీనిపై వీలైనంత త్వరగా కసరత్తు చేపట్టాలనుకున్నారు. అయితే కేసీఆర్ వ్యాఖ్యలపై చర్చ జరిగిన ఈ సమావేశానికి టీఆర్ఎస్‌సహా బీజేపీ ప్రతినిధులు ఎవరూ హాజరు కాలేదు. జేఏసీ భాగస్వామిగా మూడు రాజకీయ పార్టీలుంటే..ఒక్క న్యూడెమోక్రసీ నుంచి కె.గోవర్థన్ హాజరయ్యారు. ఇతర భాగస్వామ్య ఉద్యోగ, ప్రజా సంఘాల ప్రతినిధులు పాలుపంచుకున్నారు.

No comments:

Post a Comment