Saturday, August 7, 2010

వీర తెలంగాణం పోరు తెలంగాణం

వీర తెలంగాణం పోరు తెలంగాణం
చల్..స్వయంపాలనకై ఓరుగల్లు కోటల మీద
మా సమ్మక్క సారక్కల మెరుపు తిరుగుబాటు

అహ..కోహినూరు రక్షణ కోసం బ్రిటిషోని
మెడలొంచిన నా 'బోనాల్' లష్కర్ సైన్యం

అరె..అడవి బిడ్డల హక్కుల కోసం రజాకర్లను
కొదమసింహంలా వేటాడిన నా గోండు భీముడు

వాహ..భూమి కొరకు భుక్తి కొరకు నిజాం నాజీలతో
మా తెలంగాణ రైతుల గెరిల్లా సాయుధ పోరాటం

అహ..నాటి దిగ్గజాలైన ఫ్రెంచి పోరగాల్లను మించిన
ధీరులమ్మ నేటి నా ఉస్మానియా కాకతీయ పిల్లలు

చల్..జై తెలంగాణ అంటే జై జై తెలంగాణ అని
ప్రాణమంటే త్రునప్రాయమనే వీర శహీదులు

నాటి మేడారం సమ్మక్క సారక్క గద్దెల సాక్షిగా
నేటి గన్ పార్కు అమర వీరుల స్తూపం గుర్తుగా

శతాబ్దాలకెల్లి తెలంగాణ బిడ్డలది ఒకటే లడాయి
ఆత్మగౌరవమే ధ్యేయం స్వయం పాలనే లక్ష్యం

ఆ లక్ష్యం కోసమే మా తర తరాల ఆరాటం
ఆ తల్లి కొరకే ఈ బిడ్డల రాజీ లేని పోరాటం

ఇదే మా వీర తెలంగాణం పోరు తెలంగాణం
ఆఖరి రక్తపు బొట్టు వరకు జై తెలంగాణ

కోల్పోయిన నిమిషం -అల్లం నారాయణ part-1

కోల్పోయిన నిమిషం
-అల్లం నారాయణ
తెలంగాణ ఉద్యమం విషయంలో ఏదో నిరాశ.. బాధ. ఏమేమో జరుగుతున్నాయి. ప్రజాపథం ఎక్కడో గానీ.. ఎవరూ అడ్డుకుంటలేరు. వందరోజులు ఉపాసమున్న గ్రామాలు కూడా వ్యతిరేకిస్తలేవు. మీటింగ్‌ల మీద మీటింగ్ లు.. ఎవరి జాక్‌ల బలుపు వారు చూయించుకునే పని. అంతం లేని పోరాటం. - ఇదొక ఫ్రెండ్ మెసేజ్

హిందూ ధర్మయుద్ధాన్ని స్మరింపజేస్తూ.. గద, ధనుస్సు, ఖడ్గము చేబూనిన వారు తెలంగాణ ఉద్యమము కారణంగా భీతిల్లిన సెట్లర్లను కలవడానికి.. ధైర్యం చేసెదరు. వాళ్లూ ఇక్కడి పౌరులేనని నచ్చజెప్పెదరు. ఆత్మహత్య చేసుకున్న శ్రీకాంత్‌చారి తండ్రి శ్రీవెంకటాచారి ఈ యాత్రకు ముందు నిలిచెదరు. -మానవతారాయ్ లాంటి విద్యార్థి నాయకులు తల పెట్టిన ఒక యాత్ర గురించి ఇదొక మిత్రుని ఈమెయిల్.

ఈ మెయిల్ ఇంకా కొనసాగింది. ఆత్మహత్యలు, సెట్లర్లు, సహ జీవనం, ప్రత్యేక రాష్ట్రం. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మరొక్కసారి మరో ఉప ఎన్నికల యుద్ధం స్థాయికి కుదించినాక.. సంబరపడ్తున్న సెట్లర్లు చేసే అవమానాలు మరో కొందరిని ఆత్మహత్యలకు పురికొల్పుతాయా? ఇప్పుడిక సూటిగా.. స్పష్టంగా కొన్ని ప్రశ్నలు అడగవలసి న సమయం రాలేదా? మనమెక్కడికి పోతున్నాం.. దీన్నిట్లా ఎన్నాళ్లు సాగనిద్దాం. ఈఉన్మాదాన్ని దయచేసి ప్రశ్నించండి. - ఇదే మెయిల్‌లో ఆ మిత్రుని ఆవేదన.

అక్షరాలతో ఆడుకునే వృత్తిలో ఉన్న నాకు.. నిజానికి మెయిల్స్ అన్నా.. మెసేజ్‌లన్నా ఒకింత చిరాకు. పరాయి. మమేకం కాలేను. ఈ కాలంతో ఉంటున్నా.. ఈ గాడ్జెట్స్ విషయంలో అవి సరఫరా చేసే సమాచారం విషయంలో నా పరిమితులు నావి. కానీ.. ఈమెయిలూ.. మెసేజూ.. నన్ను కుదిపి కదిపి ఇబ్బంది పెడుతున్నాయి. మనసంత మానేరవుతున్నది. కొన్నాళ్లుగా తెలంగాణ చుట్టూ జరుగుతున్న పరిణామాలు.. జీవితమే తెలంగాణ అనుకున్న వాళ్ల కు, తెలంగాణ తప్ప మరి దారిలేదని.. తెలంగాణ పిచ్చోళ్లు అనిపించుకున్న వాళ్లకు.. జీర్ణం కాని పరిణామాలు.

ఎక్కడికి వెడ్తున్నాం.. మనం. "దుఃఖపు కోటల్లో తమ్ము తాము ఎలా బద్దలు కొట్టుకోవాలో తెలియక విషాద వాకిళ్లలో నిస్త్రాణం గా పడి ఉన్న'' (దాకరపు బాబూరావు కవిత్వం) అమాయక తల్లిదండ్రులకు ఈ నిమిషాన ఎవరు సమాధానం చెప్పుకోవాలి? ఎవరు ఈ పరిస్థితులకు బాధ్యులు? ఆత్మహత్యలో.. బలిదానాలో.. ఎంత ఆవహించిన ఉద్యమ పరిస్థితుల్లో జరుగుతాయో.. అంత దిగజారిన పరిస్థితుల్లో చప్పున చల్లారిపోవడం మీద కలిగే బెంగను కొలువగలిగిన కొలమానమేది? ఉద్యమం ఎక్కడ ఉద్వేగాలని అధిగమించిందో.. ఎక్కడ జనం మనసులను మీటి మేల్కొలిపిందో.. అక్కడే కుట్రలూ ప్రారంభమయ్యాయి.

ఎగిసిపడిన మాటల నాల్కల కొసలు తాకినవారి ఆత్మహత్యలు.. ఇప్పుడవి కేవలం స్మృతి గీతికలేనా?మున్నూటా డెబ్బైమందికి తోడు ..మరో మూడు వందల బలిదానాల అనంతరం చివరికి మిగిలేదేమిటి? మిత్రుడి మెయిల్‌లో ఉద్యమం చివరకు మరో ఉప ఎన్నికల యుద్ధంగా పరిణమించడంపై అంగలార్పు ఉంటే.. ఫ్రెండ్ మెసేజ్‌లో నూరురోజులు ఉపాసమున్న గ్రామాలు సైతం ఉద్యమమార్గాన్ని కొనసాగించకపోవడంపై వేదన ఉంది. జాక్‌లు ఎవరి బలుపు వారు నిరూపించుకునే పలుకుబడి ప్రేరేపిత, అహంప్రేరేపిత, స్వీయప్రయోజన, సంకుచిత వేదికలయినాయన్న తండ్లాట ఉంది.

"తల్లిదండ్రులు పిల్లల ప్రాణతర్పణ ప్రారంభోత్సవ కార్యక్రమాలకు బలవంతపు కరపత్రాలు పంచుతూ''ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్న చలనచిత్రం అన్న కవి అంగలార్పూ నల్లని విషాదంలో గూడు కట్టుకున్నట్టే ఉంది. ఎవరి మరణాలివి.. ఎవరి మరణాలివి.. అని సమూహంలో గుమికూడిన అందరు, అన్ని రకాల తెలంగాణవాదులను శవాలు ప్రశ్నిస్తున్న ఒక సందర్భమూ రానే వచ్చింది. ఉద్యమం ఎగిసిపడినప్పటి ఐక్యత, ఏకాత్మ కళ్లముందే నిలువు నిలువునా కరుగుతున్నప్పుడు దిగ్భ్రాంతి పడి చూస్తున్న నిఖార్సయిన ఒక తెలంగాణవాది ఆత్మఘోష ఉంది

కోల్పోయిన నిమిషం -అల్లం నారాయణ part-2

ఎందుకిలా మిగిలేం.. ఎందుకిలా జరిగిందన్న ప్రశ్నలు ఈ సందర్భాన తప్పేమీ కాబోదు. ఉప ఎన్నికల్లోనే కాదు.. చివరికి నాలుగు నెలలు జ్వలించిన గ్రామాలు.. బతుకమ్మలాడిన నాలుగు పానాదులు. బోనమెత్తిన తల్లి.. ధూమ్‌ధామైన పాటగాడు.. ఒక సంరంభం. ఒక కోలాహ లం. ఒక జాతర.. దిగ్గున మేల్కాంచిన తెలంగాణ యాతర. లాఠీలు, బుల్లెట్లు తిన్న యూనివర్సిటీలు. గర్జించిన విద్యార్థులు.. వాళ్లు విస్మృత చరిత్రను.. ఈ కపట కాలంలోనూ.. విస్మృత పోరాట రూపాలను కాగడాల్లా వెలిగించారు. స్వయంప్రకాశిత దివిటీలై.. యువకులు, విద్యార్థులు తెలంగాణను జ్వలింపజేశారు.

తెలంగాణ ప్రజలు మరొక్కసారి చరిత్ర నిండా పరుచుకున్న త్యాగాల పరంపర వెల్లువలా.. పడి లేచిన తరంగంలా నిలిచారు. అలలలలుగా కదిలారు. వాళ్లు గొప్పవాళ్లు. చరిత్రకు ఎదురేగి నిలబడ్డ ఊరేగింపుల సమూహం తెలంగాణ. పాతకథే. నేతలు నిస్సిగ్గుగా బాంచెలయ్యారు. ఎవరి కలుగుల్లో వారు ఎలుకల్లా దూరారు. ఎవ రి బానిస శరీరాల్లోకి మరోసారి వారే దూరారు. పుట్టు బానిసలు. మరో మోసం. మరో దగా. హీన చరిత్ర పునరావృతం. చివరికి లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్ సందులో.. ఢిల్లీ శ్రీకృష్ణ కమిటీ కార్యాలయం వరండాలో తాకట్టుపడింది తెలంగాణ.

లెక్క లు.. పత్రాలు.. విజ్ఞాపనలు.. విన్నపాలు వేనవేల కవిలికట్టె ల మందలో ఇరుక్కున్న తెలంగాణ ఆత్మఘోష. సరే.. రాజకీయ నేతల తోలు మందం. మరి ఉద్యమం ఏమయినట్టు? తెలంగాణకు ఒక విశ్వాసాన్నిచ్చిన సబ్బండ వర్ణాల సమ్మేళనాలు.. చరిత్ర కలిగిన ఉద్ధండపిండాలయిన ఉద్యమకారులు ఏమవుతున్నట్టు. రాజకీయం నిస్సిగ్గుగా తెలంగాణను మరోసారి బలివితర్ది మీద నిలబెట్టి ఉండవచ్చు. బానిసకొక బానిసకొక బానిసలయిన వారు.. మళ్లీ రాజకీయ ప్రయోజనాల, ప్రలోభాల, పటాటోపాలలోకి దిగజారి ఉండవచ్చు.

కానీ ప్రజలకు జవాబుదారీగా ఉండే ఉద్యమ జాక్‌లెందుకు? ఇన్ని రకాలు గా, ఇన్ని విధాలుగా.. చీలికలుగా.. పేలికలుగా.. ఎవరు చెబుతారు సమాధానం? తెలంగాణ సాధక సమస్యలో సిద్ధాంత విభేదాలు ఏవీ లేవు. అది భౌగోళికమా? సామాజికమా? ప్రజాస్వామికమా? ఏ తెలంగాణ కావాలి.. పురాచర్చ. ఫుజూ ల్ చర్చ. ఏదో ఒక తెలంగాణ.. ముందు మాకు తెలంగాణ కావాలని అంగీకరించినవాళ్లే.. ఎజెండాలు లేవు. జెండాలు లేవు. ఒకే ఒక్క తెలంగాణ అని అంగీకరించిన వాళ్లే ఎందుకిలా ఎవరికి వారుగా తయారయ్యారు.

జాక్‌లను సమన్వయ పరిచే జాక్‌ల సమన్వయ సమితులు మరిన్ని ఎందుకు పుట్టాయి. ఈ ప్రశ్నలకు ఎవరు జవాబు చెబుతారు. అందరికీ తెలంగాణ కావాలి. కానీ.. 'జాక్' వేరుగా ఉండాలి.. అందరి కీ తెలంగాణే కావాలి.. కానీ ఆయన మాటే చెల్లాలి.. అందరి కీ తెలంగాణ కావాలి.. కానీ ఆయనే సమ్వయకర్త కావాలి.. గొట్టాల ముందర ప్రగల్భాలు పలుకుతున్న నోళ్లు. మైకులు బద్ధలు కొడ్తున్న వాగ్ధాటి. ఎవరి గుండంలో వారే దుంకుతున్న.. గుడుగుడు గుంచం.. ఎందుకిలా?

కోల్పోయిన నిమిషం ,అల్లం నారాయణ part-3

విద్యార్థులూ చీలారు. జాక్‌లూ చీలి మళ్లీ నిర్మితమయ్యా యి. ఊరు బతికే ఉంది. ఉపాసం ఉంటూనే ఉంది. పల్లె బతికే ఉంది. అది తెలంగాణ పదం పాడుతూనే ఉంది. చిరంజీవి... తెలంగాణ వస్తే మావోయిస్టులు రాజ్యానికి వస్తారని భయపెట్టి తెలంగాణను అవమానిస్తూనే ఉన్నాడు. కొత్తగా కామ్రేడ్ రాఘవులు తెలంగాణ వస్తే మత కల్లోలాలు చెలరేగుతాయని మార్క్సిస్టు-లెనినిస్టు సరికొత్త సిద్ధాంతాన్ని కనిపెట్టారు. కమ్యూనిస్టు పోరాట యోధులను చాకలి ఐలమ్మ, బందగీ, దొడ్డి కొమురయ్యల స్మృతినీ అవమానించాడు.

ఒకరు తెలంగాణలో నూటికి 80 శాతం మంది సమైక్యాంధ్ర కోరుతున్నారంటారు. మరొకరు తెలంగాణ సస్యశ్యామల అన్నపూర్ణ అంటారు. మిత్రుని మెయిల్ సూచించినట్టే అవమానాల భారం అవని అంత పెరుగుతున్నది. కానీ 'జాక్'లు ఎందుకు చీలాయో? ప్రజలకు చెప్పుకోవాల్సిన బాధ్యత మిగిలే ఉంది. తీహార్ జైలు నుంచి ఈ మధ్య కోబాడ్ గాంధీ ఆయన సహచరురాలు అనూరాధ గురించి రాస్తూ అధికారం-ఒక చిన్న అధికారం కూడా అవినీతికి, పతనానికి దారి తీస్తున్న చోట, అహం, స్వప్రయోజనా లు, నాయకత్వం, పేరు ప్రతిష్టల కోసం ఆరాట పడుతూ ఉద్యమాలను నీరుకారుస్తున్న చోట అనూరాధ ఈ చెద అంటకుండా బతికారని కీర్తించారు.

ఈ తెలంగాణ ఉద్యమానికీ అదే చెద .....ఈ కపట కాలపు అగడ్తలయిన వ్యక్తి కేంద్రక బలహీనతలను అధిగమించకుండా తెలంగాణ ఉద్యమకారులు.. ఇక్కడి ప్రజలకు నాయకత్వం వహించలేరు. తెలంగాణ ప్రజ లు గొప్పవాళ్లు... వాళ్లకు నాయకత్వం వహించే వాళ్లే........ఈ ఖాళీని చరిత్ర పూరిస్తుంది.

పోరు చరిత - By Krishna Vamshi Allam

నాలుక్కొట్లామంది ఉయ్యాలొ,
నక్షలైట్లు అనె ఉయ్యాల!

నాదు స్వతంత్ర్యపోరాతం ఉయ్యాలొ,
నక్షలైట్లె చెశిన్ల? ఉయ్యాల!

మా బతుకు మాకంటె ఉయ్యాలొ,
తప్పెందుకయ్యింది? ఉయ్యాల!

కొలిమంటుకున్నంక ఉయ్యాలొ,
కమిటీలు యెశిన్లు ఉయ్యాల!

కమిటీల పేరున ఉయ్యాలొ,
కాలరాశె చూపు ఉయ్యాల!

అరచేతి అడ్డుతో ఉయ్యాలొ,
సూరీడు ఆగునా? ఉయ్యాల!

ఒక్కొక్క కణమెల్లా ఉయ్యాలొ,
రణభేరి మ్రోగిస్తం ఉయ్యాల!

తల్లడిల్లిన తల్లి ఉయ్యాలొ,
కన్నీళ్ళు తుడుస్తం ఉయ్యాల!

నిలువెల్ల మాకండ్ల ఉయ్యాలొ,
తెలంగాణ సూస్కుంటం ఉయ్యాల…..

జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
-అల్లం క్రిష్ణ వంశీ

[మొన్న 2009 యేడాది చివరలో తెలంగాణ ఉద్యమం ఉగ్రరూపం దాల్చినప్పటి నుండి తెలంగాణలొ ఇవ్వాల్టి (మార్చి 10,2010) వరకు జరిగిన పరిణామాలను గూర్చి చెప్పాలని చేసిన చిన్న ప్రయత్నం ఈ పాట.... ఉయ్యాల పాటలు తెలియని తెలంగాణొల్లు ఉండరన్నది వాస్తవం, మా తెలంగాణ బిడ్డలందరికి ఈ పాట అంకితం

పోరు చరిత - By Krishna Vamshi Allam

ఎండిన చేలల్ల ఉయ్యాలొ,
తుమ్మలు మొల్శెను ఉయ్యాల!

తాగునీల్లు లేక ఉయ్యాలొ,
ఫ్లోరోసిస్ రోగము ఉయ్యాల!

అన్నదమ్ములమైతె ఉయ్యాలొ,
ఒక్కోలే లేమేంది? ఉయ్యాల!

బొగ్గుబాయిల నేను ఉయ్యాలొ,
బెంజికారుల నువ్వు ఉయ్యాల!

దుబాయి వలసలు ఉయ్యాలొ,
ఎన్నెన్ని తిప్పలు! ఉయ్యాల!

మా కొలువుల్ల నువ్వు ఉయ్యాలొ,
కులికేటి దొంగవు ఉయ్యాల!

ఒకనెంట ఒకడచ్చి ఉయ్యాలొ,
ఒదిగినారిక్కడే ఉయ్యాల!

బతుక వలుస మాది ఉయ్యాలొ,
వలసొచ్చి నువు బలిసె ఉయ్యాల!

మాయలు మంత్రాలు ఉయ్యాలొ,
రియలేస్టేటు దందాలు ఉయ్యాల!

ఏకులోలెవచ్చి ఉయ్యాలొ,
మేకులై కూసుండే ఉయ్యాల!

గులాము నేనైతె ఉయ్యాలొ,
దొరబాబు నువ్వైతివి ఉయ్యాల!

నా భాష,యాసలు ఉయ్యాలొ,
ఎగతాళి నీకాయే ఉయ్యాల!

అక్కవే నువ్వైతే ఉయ్యాలొ,
నక్కబుద్ధులేల ఉయ్యాల!

బలిదానాలీడ ఉయ్యాలొ,
బలుపు పోరులాడ ఉయ్యాల!

లాఠిదెబ్బలీడ ఉయ్యాలొ,
లాబీయింగు లాడ! ఉయ్యాల!

నువ్వు-నేను ఇద్దరు ఉయ్యాలొ,
ఖచ్చితంగా వేరు ఉయ్యాల!

తూటాలు తిన్నోన్ని ఉయ్యాలొ,
తెలంగాణోన్ని నేను ఉయ్యాల!

ఓట్ల బిచ్చపోడు ఉయ్యాలొ,
మా నోట్ల మన్నేశే ఉయ్యాల!

పాణాలు పోతున్న ఉయ్యాలొ,
పదవీకె అతికీరి ఉయ్యాల!

మంటల్ల మండిన ఉయ్యాలొ,
మాటముచ్చటలేదు ఉయ్యాల!

ప్రజాబంధువులు ఉయ్యాలొ,
రాబందులనిపించే ఉయ్యాల!

పోరు చరిత - By Krishna Vamshi Allam

యూనివర్సిటిలల్ల ఉయ్యాలొ,
ఉద్యమించే బిడ్డలు ఉయ్యాల!

ఉద్యమాల సదువులు ఉయ్యాలొ,
ఉగ్గుపాల బట్టె ఉయ్యాల!

ప్రశ్నించే దిక్కులు ఉయ్యాలొ,
గర్జించే సింహాలు ఉయ్యాల!

హక్కులు కోరితె ఉయ్యాలొ,
మక్కలిరగతన్నె ఉయ్యాల!

కొవ్వొత్తి బట్టిన ఉయ్యాలొ,
కేసులు బెట్టిరి ఉయ్యాల!

లాఠీ చార్జిలల్ల ఉయ్యాలొ,
నెత్తుర్లు పారేను ఉయ్యాల!

చిందిన నెత్తురు ఉయ్యాలొ,
పారేను పల్లెల్లొ ఉయ్యాల!

దిక్కులన్నికూడి ఉయ్యాలొ,
ఉక్కుపిడికిలై లేచె ఉయ్యాల!

చినుకులన్నీ కూడి ఉయ్యాలొ,
తుఫాను పుట్టింది ఉయ్యాల!

చిన్నోల్ల పెద్దోల్ల ఉయ్యాలొ,
చేతులన్నీ కలిసె ఉయ్యాల!

పొడిసేటి పొద్దుల్లొ ఉయ్యాలొ,
పొరుబాటన సాగె ఉయ్యాల!

బువ్వబందులు చేసి ఉయ్యాలొ,
భూమికొసం పోరె ఉయ్యాల!

బందులు చేసిరి ఉయ్యాలొ,
బలిదానలిచ్చిరి ఉయ్యాల!