ఎందుకిలా మిగిలేం.. ఎందుకిలా జరిగిందన్న ప్రశ్నలు ఈ సందర్భాన తప్పేమీ కాబోదు. ఉప ఎన్నికల్లోనే కాదు.. చివరికి నాలుగు నెలలు జ్వలించిన గ్రామాలు.. బతుకమ్మలాడిన నాలుగు పానాదులు. బోనమెత్తిన తల్లి.. ధూమ్‌ధామైన పాటగాడు.. ఒక సంరంభం. ఒక కోలాహ లం. ఒక జాతర.. దిగ్గున మేల్కాంచిన తెలంగాణ యాతర. లాఠీలు, బుల్లెట్లు తిన్న యూనివర్సిటీలు. గర్జించిన విద్యార్థులు.. వాళ్లు విస్మృత చరిత్రను.. ఈ కపట కాలంలోనూ.. విస్మృత పోరాట రూపాలను కాగడాల్లా వెలిగించారు. స్వయంప్రకాశిత దివిటీలై.. యువకులు, విద్యార్థులు తెలంగాణను జ్వలింపజేశారు.
తెలంగాణ ప్రజలు మరొక్కసారి చరిత్ర నిండా పరుచుకున్న త్యాగాల పరంపర వెల్లువలా.. పడి లేచిన తరంగంలా నిలిచారు. అలలలలుగా కదిలారు. వాళ్లు గొప్పవాళ్లు. చరిత్రకు ఎదురేగి నిలబడ్డ ఊరేగింపుల సమూహం తెలంగాణ. పాతకథే. నేతలు నిస్సిగ్గుగా బాంచెలయ్యారు. ఎవరి కలుగుల్లో వారు ఎలుకల్లా దూరారు. ఎవ రి బానిస శరీరాల్లోకి మరోసారి వారే దూరారు. పుట్టు బానిసలు. మరో మోసం. మరో దగా. హీన చరిత్ర పునరావృతం. చివరికి లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్ సందులో.. ఢిల్లీ శ్రీకృష్ణ కమిటీ కార్యాలయం వరండాలో తాకట్టుపడింది తెలంగాణ.
లెక్క లు.. పత్రాలు.. విజ్ఞాపనలు.. విన్నపాలు వేనవేల కవిలికట్టె ల మందలో ఇరుక్కున్న తెలంగాణ ఆత్మఘోష. సరే.. రాజకీయ నేతల తోలు మందం. మరి ఉద్యమం ఏమయినట్టు? తెలంగాణకు ఒక విశ్వాసాన్నిచ్చిన సబ్బండ వర్ణాల సమ్మేళనాలు.. చరిత్ర కలిగిన ఉద్ధండపిండాలయిన ఉద్యమకారులు ఏమవుతున్నట్టు. రాజకీయం నిస్సిగ్గుగా తెలంగాణను మరోసారి బలివితర్ది మీద నిలబెట్టి ఉండవచ్చు. బానిసకొక బానిసకొక బానిసలయిన వారు.. మళ్లీ రాజకీయ ప్రయోజనాల, ప్రలోభాల, పటాటోపాలలోకి దిగజారి ఉండవచ్చు.
కానీ ప్రజలకు జవాబుదారీగా ఉండే ఉద్యమ జాక్‌లెందుకు? ఇన్ని రకాలు గా, ఇన్ని విధాలుగా.. చీలికలుగా.. పేలికలుగా.. ఎవరు చెబుతారు సమాధానం? తెలంగాణ సాధక సమస్యలో సిద్ధాంత విభేదాలు ఏవీ లేవు. అది భౌగోళికమా? సామాజికమా? ప్రజాస్వామికమా? ఏ తెలంగాణ కావాలి.. పురాచర్చ. ఫుజూ ల్ చర్చ. ఏదో ఒక తెలంగాణ.. ముందు మాకు తెలంగాణ కావాలని అంగీకరించినవాళ్లే.. ఎజెండాలు లేవు. జెండాలు లేవు. ఒకే ఒక్క తెలంగాణ అని అంగీకరించిన వాళ్లే ఎందుకిలా ఎవరికి వారుగా తయారయ్యారు.
జాక్‌లను సమన్వయ పరిచే జాక్‌ల సమన్వయ సమితులు మరిన్ని ఎందుకు పుట్టాయి. ఈ ప్రశ్నలకు ఎవరు జవాబు చెబుతారు. అందరికీ తెలంగాణ కావాలి. కానీ.. 'జాక్' వేరుగా ఉండాలి.. అందరి కీ తెలంగాణే కావాలి.. కానీ ఆయన మాటే చెల్లాలి.. అందరి కీ తెలంగాణ కావాలి.. కానీ ఆయనే సమ్వయకర్త కావాలి.. గొట్టాల ముందర ప్రగల్భాలు పలుకుతున్న నోళ్లు. మైకులు బద్ధలు కొడ్తున్న వాగ్ధాటి. ఎవరి గుండంలో వారే దుంకుతున్న.. గుడుగుడు గుంచం.. ఎందుకిలా?
No comments:
Post a Comment