కోల్పోయిన నిమిషం
-అల్లం నారాయణ
తెలంగాణ ఉద్యమం విషయంలో ఏదో నిరాశ.. బాధ. ఏమేమో జరుగుతున్నాయి. ప్రజాపథం ఎక్కడో గానీ.. ఎవరూ అడ్డుకుంటలేరు. వందరోజులు ఉపాసమున్న గ్రామాలు కూడా వ్యతిరేకిస్తలేవు. మీటింగ్‌ల మీద మీటింగ్ లు.. ఎవరి జాక్‌ల బలుపు వారు చూయించుకునే పని. అంతం లేని పోరాటం. - ఇదొక ఫ్రెండ్ మెసేజ్
హిందూ ధర్మయుద్ధాన్ని స్మరింపజేస్తూ.. గద, ధనుస్సు, ఖడ్గము చేబూనిన వారు తెలంగాణ ఉద్యమము కారణంగా భీతిల్లిన సెట్లర్లను కలవడానికి.. ధైర్యం చేసెదరు. వాళ్లూ ఇక్కడి పౌరులేనని నచ్చజెప్పెదరు. ఆత్మహత్య చేసుకున్న శ్రీకాంత్‌చారి తండ్రి శ్రీవెంకటాచారి ఈ యాత్రకు ముందు నిలిచెదరు. -మానవతారాయ్ లాంటి విద్యార్థి నాయకులు తల పెట్టిన ఒక యాత్ర గురించి ఇదొక మిత్రుని ఈమెయిల్.
ఈ మెయిల్ ఇంకా కొనసాగింది. ఆత్మహత్యలు, సెట్లర్లు, సహ జీవనం, ప్రత్యేక రాష్ట్రం. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మరొక్కసారి మరో ఉప ఎన్నికల యుద్ధం స్థాయికి కుదించినాక.. సంబరపడ్తున్న సెట్లర్లు చేసే అవమానాలు మరో కొందరిని ఆత్మహత్యలకు పురికొల్పుతాయా? ఇప్పుడిక సూటిగా.. స్పష్టంగా కొన్ని ప్రశ్నలు అడగవలసి న సమయం రాలేదా? మనమెక్కడికి పోతున్నాం.. దీన్నిట్లా ఎన్నాళ్లు సాగనిద్దాం. ఈఉన్మాదాన్ని దయచేసి ప్రశ్నించండి. - ఇదే మెయిల్‌లో ఆ మిత్రుని ఆవేదన.
అక్షరాలతో ఆడుకునే వృత్తిలో ఉన్న నాకు.. నిజానికి మెయిల్స్ అన్నా.. మెసేజ్‌లన్నా ఒకింత చిరాకు. పరాయి. మమేకం కాలేను. ఈ కాలంతో ఉంటున్నా.. ఈ గాడ్జెట్స్ విషయంలో అవి సరఫరా చేసే సమాచారం విషయంలో నా పరిమితులు నావి. కానీ.. ఈమెయిలూ.. మెసేజూ.. నన్ను కుదిపి కదిపి ఇబ్బంది పెడుతున్నాయి. మనసంత మానేరవుతున్నది. కొన్నాళ్లుగా తెలంగాణ చుట్టూ జరుగుతున్న పరిణామాలు.. జీవితమే తెలంగాణ అనుకున్న వాళ్ల కు, తెలంగాణ తప్ప మరి దారిలేదని.. తెలంగాణ పిచ్చోళ్లు అనిపించుకున్న వాళ్లకు.. జీర్ణం కాని పరిణామాలు.
ఎక్కడికి వెడ్తున్నాం.. మనం. "దుఃఖపు కోటల్లో తమ్ము తాము ఎలా బద్దలు కొట్టుకోవాలో తెలియక విషాద వాకిళ్లలో నిస్త్రాణం గా పడి ఉన్న'' (దాకరపు బాబూరావు కవిత్వం) అమాయక తల్లిదండ్రులకు ఈ నిమిషాన ఎవరు సమాధానం చెప్పుకోవాలి? ఎవరు ఈ పరిస్థితులకు బాధ్యులు? ఆత్మహత్యలో.. బలిదానాలో.. ఎంత ఆవహించిన ఉద్యమ పరిస్థితుల్లో జరుగుతాయో.. అంత దిగజారిన పరిస్థితుల్లో చప్పున చల్లారిపోవడం మీద కలిగే బెంగను కొలువగలిగిన కొలమానమేది? ఉద్యమం ఎక్కడ ఉద్వేగాలని అధిగమించిందో.. ఎక్కడ జనం మనసులను మీటి మేల్కొలిపిందో.. అక్కడే కుట్రలూ ప్రారంభమయ్యాయి.
ఎగిసిపడిన మాటల నాల్కల కొసలు తాకినవారి ఆత్మహత్యలు.. ఇప్పుడవి కేవలం స్మృతి గీతికలేనా?మున్నూటా డెబ్బైమందికి తోడు ..మరో మూడు వందల బలిదానాల అనంతరం చివరికి మిగిలేదేమిటి? మిత్రుడి మెయిల్‌లో ఉద్యమం చివరకు మరో ఉప ఎన్నికల యుద్ధంగా పరిణమించడంపై అంగలార్పు ఉంటే.. ఫ్రెండ్ మెసేజ్‌లో నూరురోజులు ఉపాసమున్న గ్రామాలు సైతం ఉద్యమమార్గాన్ని కొనసాగించకపోవడంపై వేదన ఉంది. జాక్‌లు ఎవరి బలుపు వారు నిరూపించుకునే పలుకుబడి ప్రేరేపిత, అహంప్రేరేపిత, స్వీయప్రయోజన, సంకుచిత వేదికలయినాయన్న తండ్లాట ఉంది.
"తల్లిదండ్రులు పిల్లల ప్రాణతర్పణ ప్రారంభోత్సవ కార్యక్రమాలకు బలవంతపు కరపత్రాలు పంచుతూ''ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్న చలనచిత్రం అన్న కవి అంగలార్పూ నల్లని విషాదంలో గూడు కట్టుకున్నట్టే ఉంది. ఎవరి మరణాలివి.. ఎవరి మరణాలివి.. అని సమూహంలో గుమికూడిన అందరు, అన్ని రకాల తెలంగాణవాదులను శవాలు ప్రశ్నిస్తున్న ఒక సందర్భమూ రానే వచ్చింది. ఉద్యమం ఎగిసిపడినప్పటి ఐక్యత, ఏకాత్మ కళ్లముందే నిలువు నిలువునా కరుగుతున్నప్పుడు దిగ్భ్రాంతి పడి చూస్తున్న నిఖార్సయిన ఒక తెలంగాణవాది ఆత్మఘోష ఉంది
No comments:
Post a Comment