Wednesday, August 11, 2010

తెలంగాణ బిడ్డలారా.. తెలుసుకోండి! -1

ఓరుగల్లులో శ్రీకారం..
ఆంధ్రపాలకుల అహంకారజ్వాలలో మాడిపోయిన తెలంగాణ వాసుల పోరుకు ఓరుగల్లులో శ్రీకారం చుట్టారు.మొదట ఈ ఉద్యమం విద్యార్థుల ఆధ్వర్యంలో 1952 జూన్‌ 26న వరంగల్‌లో ప్రారంభమైంది. స్థానికేతరులను ఉద్యోగాల నుంచి తొలగించి స్థానికులకు అవకాశం కల్పిస్తామన్న హామీతో ఉద్యమాన్ని విరమించారు. ఆ తర్వాత అదే ఏడాది ఆగస్టు 7వ తేదీన ఖమ్మం మెట్టులో మరో ఉద్యమం జరిగింది. ఆ తర్వాత సికింద్రాబాద్‌, ఔరంగాబాద్‌ తదితర చోట్ల ఆందోళనలు జరిగాయి. హన్మకొండలో విద్యార్థుల ఒంటి మీద లాఠీలు విరిగాయి. దీన్ని నిరసిస్తూ హైదరాబాద్‌, సూర్యాపేట పట్టణాలలో నినాదాలు, ర్యాలీలు, బహిరంగ సభలతో తెలంగాణ అట్టుడికింది. తెలంగాణ ఐక్యవేదిక ఉద్యమ నాయకుడైన కేశవరావుజాదవ్‌ కూడా ఈ ఉద్యమంలో పాలు పంచుకున్నారు. ఈ ఉద్యమం పోలీసు కాల్పులకు దారి తీసింది. ఈ కాల్పులలో ఏడుగురు విద్యార్థులు నేలకొరిగారు. ఇదే దశలో కాళోజీ నారాయణరావు, జయశంకర్‌ తదితరులు ఈ ఉద్యమానికి మరింత ఊపు తీసుకొచ్చారు.

ఆంధ్రుల సృష్టి విశాలాంధ్ర
మహా భారతంలో శకునిలా మాయపాచికలతో పథక రచన చేసే ఆంధ్రులు, ఆంధ్రపాలకుల కుట్రల ఫలితంగా విశాలాంధ్ర ఉద్యమం బలం పుంజుకుంది. 1949లో అయ్యిదేవర కాళేశ్వర్‌రావు ఈ విశాలాంధ్ర ఉద్యమానికి శ్రీకారం చుట్టి తెలంగాణ విలీనానికి పాచికలు కదిపారు. ఆంధ్ర మహాసభలో సైతం ఈ ప్రస్తావన తీసుకురాగా అప్పటి ప్రధాని పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ ఇది గాలి మాటగా కొట్టిపారేశారు. సుందరయ్య 'విశాలాంధ్రలో ప్రజారాజ్యం', కమ్యూనిస్టుల ఒకే జాతి, ఒకే భాష. ఒకే రాష్ట్రం అన్న ప్రచారాన్ని ఉద్యమానికి ఊపునిచ్చాయి. కాంగ్రెస్‌కు తెలంగాణలో 1952లో జరిగిన ఎన్నికలలో అధిక సీట్లు రాకపోవడంతో ఈ ఉద్యమానికి మరింత ఊపునిచ్చారు. వీరి కుట్రల ఫలితంగా మొదట విజయవాడ అనుకున్నా తర్వాత కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత హైదరాబాద్‌ రాజధానిగా ఆంధ్రరాష్ట్రం అవతరించింది ఆంధ్ర ప్రాంతం నుంచి బెజవాడ గోపాల్‌రెడ్డి, నీలం సంజీవరెడ్డి, గౌతులచ్చన్న, అల్లూరి సత్యనారాయణ, తెలంగాణ నుంచి బూర్గుల రామకృష్ణారావు, కావిరంగారెడ్డి, మర్రిచెన్నారెడ్డి,జేవీ నర్సింగ్‌రావులు 1956 ఫిబ్రవరి 20వతేదీన ఢిల్లీలో సమావేశమై ఓ నిర్ణయానికి రాగా 1956 నవంబరు 1వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడింది.

అమలుకు నోచని 14 సూత్రాలు
ఆంధ్రుల ఉక్కుపాదాలు తెలంగాణ ప్రాబల్యాన్ని అణిచివేసే ప్రక్రియ ఆక్షణం నుంచే ఆరంభమైంది. ఈ రాష్ట్రానికి ఆంధ్ర-తెలంగాణ రాష్ట్రంగా పేరు పెడదామన్న తెలంగాణ నేతల వాదనను ఆక్షేపించిన ఆంధ్రనేతలు దీనిని ఆంధ్రప్రదేశ్‌గా మార్చేశారు. ప్రాంతీయ విభేదాలు రాకుండా ఉండేందుకు గాను కేంద్రం సమక్షంలో ఆనాడే 14 సూత్రాలను రూపొందించారు. కానీ అవేవీ అమలులో లేవు. తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చే మిగులు బడ్జెట్‌ ఆప్రాంతం అభివృద్ధికే కేటాయించాలని, మధ్య పాన నిషేధాన్ని తెలంగాణ వాసులు కోరితే అమలు చేయాలని, విద్యా, ఉద్యోగరంగాలలో తెలంగాణకు సంబంధించి ఇక్కడి వారికే ప్రాధాన్యత ఇవ్వాలని, ఉద్యోగాల తీసివేత ఆయా ప్రాంతాల వారి నిష్పత్తిని బట్టే జరగాలని, ముఖ్యమంత్రిత్వ శాఖలలో ఏవేనీ రెండు శాఖలు తెలంగాణ నేతలకు అప్పగించాలని ఇలాంటి వన్నీ అందులో ఉన్నాయి. కానీ ఇన్నేళ్లలో వీటిలో ఏ ఒక్కటీ అమలు లోనికి రాలేదు. అణిచివేతలు, దురాక్రమణలు, అధిపత్యం, చివరికి అంత్యక్రియలలోనూ తెలంగాణ వాసుల పట్ల వివక్ష కొనసాగింది.

పాల్వంచలో మొదలైన ఉద్యమం
ఈ వివక్షను ఓర్వలేకపోయిన తెలంగాణ వాసుల గుండెలు అగ్ని గుండాల్లా రగిలిపోయాయి. ఒక జాతిని వేరొక జాతి పీడించే సాంఘిక ధర్మం... ఇంకానా... ఇకపై సాగదు... అన్న శ్రీశ్రీ అక్షరాల సాక్షిగా ఖమ్మం జిల్లా పాల్వంచలోని ధర్మల్‌ పవర్‌ స్టేషన్‌లో 1969 జనవరి 5వ తేదీన మళ్లీ ఉద్యమం మొదలైంది. తెలంగాణ వాసులు కాని వారిని వెనక్కి పంపించాలన్న ఈ ఉద్యమం జనవరిలో నిజమాబాద్‌కు పాకింది. మర్రి చెన్నారెడ్డితో పాటు ప్రముఖులు సహకారం ఉండడంతో ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. ఉద్యమాలు, ర్యాలీలు, నినాదాలు, లాఠీఛార్జీలతో రాజధాని నగరమైన హైదరాబాద్‌ వేడెక్కింది. ఫలితం అప్పటి ముఖ్యమంత్రి కాసుబ్రహ్మనందరెడ్డి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆంధ్ర ఉద్యోగులను వెనక్కి పంపిస్తామని, తెలంగాణ నిధులలెక్క తేల్చి చెపుతామని, తెలంగాణ రక్షణ అమలు చేస్తామని చెప్పారు. హామీల ద్వారా ఉద్యమాన్ని నీరుగార్చారు. కానీ ఆహామీలు కూడా అమలుకు నోచుకోలేదు. ఉద్యమ ఫలితంగా తెలంగాణ వాసులను రెండువేల ఉద్యోగాలు మాత్రం కేటాయించారు. ఇలా చెపుతూపోతే తెలంగాణ ఉద్యమం నిరంతరం కొనసాగుతూనే ఉంది. తెలంగాణ వాసుల గుండె నిత్యం రగిలిపోతూనే ఉంది

No comments:

Post a Comment