Wednesday, August 11, 2010

తెలంగాణ బిడ్డలారా.. తెలుసుకోండి! -1

'నా తెలంగాణ.. కోటి రతనాల వీణ..' ఇది ఒకప్పటి మాట.. నేడు ఈ ప్రాంత బిడ్డలు కష్టాల కొలిమిలో కాలిపోతూ కన్నీళ్లు పెడుతోందెందుకు..? ఆకలి మంటల్లో కాలుతూ మరణశయ్య మీద కొట్టుమిట్టాడుతోందెందుకు..? బుక్కెడు బువ్వకు దిక్కు లేక, డొక్క నిండేందుకు రెక్కాడక వలస బాట పట్టిందెందుకు..? పసి పిల్లల జీవితాలకు వెలకట్టడెమెందుకు.. పడతి మానానికి ఖరీదు కట్టడమెందుకు..? బ్రిటిష్‌ పాలకులతో పోరాడి గెంటేసినా, రజాకార్లను రక్తం చిందిస్తూనే తరిమికొట్టినా తీరని ఈ అవస్థను సృష్టించింది ఆంధ్రపాలకుల వ్యవస్థ. ఇది నిష్టూర సత్యం.. నిత్యం కళ్ల ముందు కనిపించే సత్యం.. ఇది తెలియాలంటే మీకు తెలంగాణ ఏమిటో తెలియాలి.. ఉమ్మడి రాష్ట్రాలు ఎలా ఏర్పడ్డాయో తెలియాలి.. వాటి వల్ల ఏర్పడిన నష్టాలు తెలియాలి.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో కలిగే లాభాలు తెలియాలి.. తెలుసుకోండి.. ఒక్కసారి ఆలోచించండి..!

నాటి తెలంగాణ
రాజకీయ చరిత్ర చూస్తే 1294-1351 కాలంలో ముల్కీ ఉద్యమాలు ముఖ్య పాత్ర పోషించాయి. ఖిల్లీ, తుగ్లగ్‌లతో పాటు దక్షిణాది నుంచి వచ్చి స్థిరపడిన వారందరినీ దక్కనీలుగా పిలిచారు. ఆ తర్వాత విభేదాలతో వీరంతా షియాలు, సున్నీలుగా విడిపోయారు. 1422-1435 కాలంలో ఒకటో అహ్మద్‌షా కాలంలో ఈ విభేదాలు తారా స్థాయికి చేరాయి. 1436-1458లో రెండో అహ్మద్‌షా కాలం నాటికి ఇవి మరింత తీవ్రమయ్యాయి. 1512లో కూలీకుతుబ్‌షా ఈ ముల్కీ, నాన్‌ముల్కీ ఉద్యమాల ఫలితంగా సంభవించిన రాజ్య పతనం నుంచి గుణపాఠం నేర్చుకొని, అవి పునరావృతం కాకుండా జాగ్రత్త పడ్డాడు.

మళ్లీ తలెత్తిన ముల్కీ సమస్య
ఐదో నిజాం కాలంలో మళ్లీ ముల్కీ సమస్య తలెత్తి ఉద్యమాలు మొదలయ్యాయి. అవి ఈనాటికీ రావణ కాష్టంలా కాలుతూనే ఉన్నాయి. 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగి మొగల్‌ సామ్రాజ్యం అంతరించగానే ఢిల్లీ, లక్నో, ముర్షిదాబాద్‌ ప్రాంతాల్లో ఉద్యోగాలు కోల్పోయిన వారంతా ఏ కల్లోలం లేని నిజాం రాజ్యానికి వలస వచ్చారు. కవులు, కళాకారులు, విద్యావంతులు ఇక్కడికి తరలివచ్చారు. ఐదో నిజాం కాలంలో సాలార్‌జంగ్‌ పరిపాలనా సంస్కరణల వల్ల కాయస్తులు, ఖత్రీలు పెద్ద ఎత్తున ఉద్యోగాల కోసం వలస వచ్చారు. స్థానికులకు శిక్షణనిచ్చి తీర్చిదిద్ది వెనక్కి వెళ్లిపోతారన్న ఉద్దేశంతో చేపట్టిన ఈ సంస్కరణ బెడిసి కొట్టింది. ఇక్కడే తిష్ట వేసుకొని ఉన్న ఉద్యోగాలే కాకుండా వచ్చిన ఉద్యోగాల్లో కూడా తమ వారినే నియమించుకొని స్థానికులను అణిచివేశారు. కిషన్‌ప్రసాద్‌ బహద్దుర్‌ పోరాటంతో కొంత మేరకు ప్రయోజనం చేకూరినా ఆ తర్వాత పరిస్థితి మళ్లీ మొదటి కొచ్చింది. 1948లో పోలీసు చర్య జరిగే వరకు ఉస్మానియా యూనివర్సిటీలో నాన్‌ముల్కీలదే పెత్తనం.

మొగ్గ తొడిగిన నిరసన
నైజాం హైదరాబాద్‌ సంస్థానం మూడు భాషా ప్రాంతాలతో కలిసి ఉండేది. రాజధాని హైదరాబాద్‌తో పాటు తెలుగు మాట్లాడే 8 జిల్లాలు హైదరాబాద్‌లో ఉండేవి. వీటితో పాటు మరాఠీ భాష మాట్లాడే 5 జిల్లాలు, కన్నడం మాట్లాడే మూడు జిల్లాలు కలుపుకొని మొత్తం 16 జిల్లాలు హైదరాబాద్‌ సంస్థానంలో ఉండేవి. 1948 సెప్టెంబరు 13వ తేదీన భారత ప్రభుత్వం హైదరాబాద్‌ సంస్థానంపై పోలీస్‌ చర్యను ప్రారంభించింది. సెప్టెంబరు 17వ తేదీన నిజాం రాచరికం అంతమైంది. హైదరాబాద్‌ రాష్ట్రంలో మిలిటరీ గవర్నర్‌గా జేఎన్‌ చౌదరినినియమించారు. 1949 డిసెంబరు వరకు ఇది కొనసాగింది. 1950లో సీనియర్‌ సివిల్‌ అధికారి వెల్లోడి ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పడింది. 1952 సాధారణ ఎన్నికల తర్వాత బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా నూతన ప్రజా ప్రభుత్వం ఏర్పాటైంది. ఇదే సమయంలో ఉద్యోగాల వేటలో ఆంధ్రులు తెలంగాణకు వలస రావడం ప్రారంభమైంది. తెలంగాణ వారికి ఇంగ్లిష్‌ పరిజ్ఞానం లేదన్న సాకుతో ఇష్టారాజ్యంగా ఆంధ్రులను ఇక్కడి ఉద్యోగాలలో నియమించడం మొదలైంది. ఈ నేపథ్యంలో 1952 ఆగస్టులో హైదరాబాద్‌ హిత సంరక్షణ సమితి పేరిట తొలి ఉద్యమం ఆంధ్రుల పెత్తనానికి నిరసనగా మొగ్గతొడిగింది. కానీ అధిష్టానం బెదిరింపులు, బుజ్జగింపుల కారణంగా మొగ్గలోనే రాలిపోయింది.

No comments:

Post a Comment