Friday, March 26, 2010

ఉద్యమం వర్ధిల్లాలి! తెలంగాణ సాధించాలి!!

దశాబ్దాలుగా ప్రత్యేక రాష్ట్రంకోసం చేస్తున్న పోరుకు ఫలితం, కలలు సాకారమయ్యే రోజులివి. తెలంగాణా రాష్ట్ర సాధనకోసం ప్రజలంతా ఉద్యమంలోకి దూకుతున్నారు. నాయకులు, పెట్టుబడిదారులు, కుల, మత చాందసవాదులు ఏ స్వార్థంకోసం తపిస్తున్నారో తెలియదు గానీ, సామాన్య ప్రజానీకం, యువత మాత్రం ఉద్యమాన్ని భుజాలనెత్తుకొని, పోలీసు లాఠీలకు, అధికారుల బెదిరింపులకు, తెలంగాణవ్యతిరేకుల ధనాశకు తలొగ్గకుండా, ధైర్యంతో ప్రాణాలనుసైతం లెక్కచేయకుండా ఉద్యమిస్తున్నారు. ఏ పాపం ఎరుగని నిరుపేద యువతీ యువకులు కళ్ళముందుకొచ్చిన ప్రత్యేక రాష్ట్రం కొందరి అహంకార, అధికార, ధన బలం ముందు తలవంచుకు పోతుంటే, ఇక రాష్ట్రసాధన కలగానే మిగిలిపోతుందనే భయంతో, బాధతో దిక్కుతోచక ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. ఇక్కడ ఆలోచించాల్సింది, ప్రత్యేకరాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం సుముఖంగా ప్రకటన చేసిన తర్వాత, మళ్ళీ వెనక్కి తీసుకోవడం వెనక దాగి ఉన్న కుట్ర గురించి, దానికి పాల్పడ్డ వాళ్ళకున్న బలం గురించి.
   తెలంగాణ వ్యతిరేక పెట్టుబడుదారులు , రాజకీయ నాయకులకు కేంద్రం తలొగ్గింది. వీరికి అంత బలం ఎవరిచ్చారు? అది ఇక్కడి ప్రజలే.. ఇది నిజం. ప్రస్తుత రాజకీయ ప్రభావాలను తట్టుకుని ప్రభుత్వాలు నిలవాలంటే ఆర్ధికంగా పార్టీలు బలంగా ఉండాలి. కారణం ఏదైనా మన రాష్ట్రంలో ఆర్ధికంగా బలంగా ఉన్నది సీమాంద్ర ప్రాంతానికి చెందినవారే. కాని వారి వ్యాపార వృద్ధికి తోడ్పడ్తుంది మాత్రం తెలంగాణ ప్రజలే. ఆంద్ర, రాయలసీమలు రెండూ పెట్టుబడులలో ఒకదానితో ఒకటి  పోటీపడుతున్నై. వారికున్న ప్రాంతీయ అభిమానంతో వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో గట్టిపోటీ ఉంటుంది. అందుకే వారి వ్యాపారాలు అక్కడ తొందరగా వృద్ధిచెందవు. తెలంగాణ ప్రాంతం మాత్రం వీరి ఉత్పత్తులను ప్రాంతాలకతీతంగా వినియోగిస్తారు. ఇక్కడి ప్రాంత ప్రజలు వ్యాపారాల్లో పోషించే పాత్ర తక్కువ కావడంవల్ల అధిక లాభాలనార్జించే అన్ని రంగాల్లో సీమాంద్ర పెట్టుబడిదారులే కనిపిస్తారు.
  అంటే ఒకవైపు తెలంగాణా ప్రజల సంపదతో వ్యాపారం చేస్తూ, అదే సంపదతో తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు. ఇలా ఆలోచిస్తే తెలంగాణ ప్రజలే తెలంగాణను వ్యతిరేకిస్తున్నట్లు. అలాంటప్పుడు ఎన్ని ఉద్యమాలు వచ్చినా పెద్దప్రయోజనం ఏమీ ఉండదు. ఏ ఉద్యమమయినా  ఫలితాలను పొందాలంటే, ఉద్యమం ఎక్కువకాలం నిలబడాలి. ఉద్యమ విధి విధానాలు, ఆశయాలూ, లక్షాలూ సామాన్యుడిని చేరాలి. నేటి పరిస్తితుల్లో ఎలాంటి విషయమైన చిటికెలో ప్రపంచమంతా వ్యాప్తి  చెందించే మాద్యమం TV చానల్స్ మాత్రమే. మరి తెలంగాణ ఉద్యమాన్ని సద్భావంతో, సదుద్దేశ్యంతో సూటిగా లక్ష్యం వైపు గురిపెట్టగలిగే రీతిలో చూపించే ఏ ఒక్క ఛానల్ అయినా ఉందా అంటే అది అంతుదొరకని ప్రశ్నే. ఒకవేల ఉన్నా వాటికున్న ఆదరణ అంతంతమాత్రమే. ఒక విషయం మంచిదా, చెడ్డదా అని నిర్ణయించేది, పదిమందీ దాని గురించి ప్రస్తావించడం వల్లే. ఈ నగర జీవితంలో ఆ పదిమందీ తనే అయి పోషిస్తున్నాయి T V చానల్స్. అందుకే ఒక్క రోజులో తివారి విటుడయ్యాడు, రాజశేఖర్ రెడ్డి దేవుడయ్యాడు. ఇదంతా మీడియా సృష్టి కాదా?
 తెలంగాణాలోని ప్రతి పల్లె అగ్నిగుండంలా ఉంది. రేపటి తరానికి దిశా నిర్దేశాలు సూచించే యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రభుత్వం, పోలీసులు మానవత్వం మరిచి యువతీ యువకులను దారుణంగా హింసిస్తున్నారు. ఇన్ని జరిగినా ఏ టి.వి ఛానల్లో కూడా వీటికి సరైనస్తానం  దొరకకపోవడం బాదాకరం. చాలా సందర్బాలలో తెలంగాణ ప్రజల మద్య విబేదాలు పెంచే రకంగా ప్రోగ్రామ్స్ వస్తున్నాయ్ తప్ప ఇది న్యాయమైన పోరాటం అని చెప్పే టి.వి చానల్స్ కరువయ్యాయ్. ఉద్యమం నిలబడాలంటే ప్రతి ఒక్కరూ ఉద్యమంలో పాల్గొని గాయాలపాలవడం, చనిపోవడం, ఆత్మహత్యలు చేసుకోవడం పరిష్కారం కాదు. ఈ ఉద్యమం ఓ పోరు. ఈ పోరులో నెగ్గాలంటే వ్యతిరేక శక్తులను బలహీన పరచాలి. ఇక్కడ వ్యతిరేకతకు ఉన్న బలం డబ్బు, అధికారం. ఆర్తికంగా బలహీనమైతే రాజకీయంగా ఎదగడం కష్టం. అందుకే సీమాంద్ర వస్తు, వ్యాపార, సేవలను బహిష్కరించాలి. అందులో బాగంగా అన్నిటికంటే ముందుగా చేయాల్సింది ఉద్యమాన్ని వక్రీకరించి, నీరుగార్చే టి.వి చానల్స్ ని ఆదరించక పోవడం లేదా వాటిని పూర్తిగా తొలగించడం. దీంతో ముందుగా యువత బలిదానాలు ఆగిపోతాయి. ప్రజలకు నిజాలు తెలవకపోయినా అబద్ధాలకు, అభూతాలకు తావుండదు. ఎప్పుడూ ఎదుటివాడిని వేలెత్తి చూపే చానల్స్ T.R.P(Target Rating Point)  లు పడిపోయి ఇక ముందైనా నిజాలను చూపించే ప్రయత్నాలు చేస్తాయి. ఆకలి కేకలకూ, కన్నీటి వ్యధలకూ గుర్తింపు దక్కుతుంది. ఉద్యమాలు వర్ధిల్లుతాయి. 


ఉద్యమం వర్ధిల్లాలి! తెలంగాణ సాధించాలి!!

No comments:

Post a Comment