Tuesday, March 22, 2011

కుంభకర్ణ అవతారమా … ఓ కేంద్ర ప్రభుత్వమా

కుంభకర్ణ అవతారమా … ఓ కేంద్ర ప్రభుత్వమా


———————————————-



కలికాల కుంభకర్ణ అవతారమా … ఓ కేంద్ర ప్రభుత్వమా

మరుగుతున్నది చూడుమా … రాష్ట్రం నేడు మలిదశ ప్రత్యేక ఉద్యమాన

మాట ఇస్తివి మడమ తిప్పకుమా …మత్తు వదిలి మార్గం చూపుమా



ప్రత్యేక రాష్ట్రం ఆవశ్యమని తలిస్తివి

పార్లమెంటున ప్రకటన చేస్తివి

ఎవరి సొమ్ము తిని గమ్మున ఉంటివి

ఏ వ్యూహం పన్ని మౌనం వహిస్తివి ??



నీ మౌనం మారణాయుధమై మరణ శాసనం లిఖిస్తుంటే

మండిన గుండెలు సహనం చచ్చి సజీవ దహనం అవుతుంటే

నీ మనసు గెలుసునవి బహుమతులే గనుక అయితే ….

కాలిన కళేబరాలే కానుకలుగా ఇద్దుము

కాలయాపన చేయక కళ్ళు తెరువుమా ..

కుంభకర్ణ అవతారమా .. ఓ కేంద్ర ప్రభుత్వమా !!



ఇల్లు గుల్లై ఒళ్ళు కాల్చుకుంటుంటే

ఓట్ల కోసం పొత్తుల ఎత్తుల ఆటలడుతున్నావ్

మలిన రాజకీయ ‘విలీన’ షరతులు విధిస్తూ

విద్యార్థి భవితను వీధి పాలు చేస్తున్నావ్

ఇది వికృత చేష్టల పరాకాష్ట కాదా … ప్రజా ఆకాంక్షలకు పాతర కాదా ??



ప్రజా ఆవేదన అరణ్య రోదన అవుతుంటే

ప్రజాస్వామ్యం పరిహాస మవుతుంటే

ప్రభుత్వమే జడత్వం మై ..పాలకులే ప్రేక్షకులై

పరిష్కారం తెలుపకుంటే ….



ఉద్యమాలే ఉరితాడులై నీ ఊపిరి తీసును తెలుసుకోనుమా …

మేలుకొని రాష్ట్రమిచ్చి మా మదిని ఏలుకొనుమా..

కుంభకర్ణ అవతారమా … ఓ కేంద్ర ప్రభుత్వమా !!



—- సుధీంద్ర భార్గవ

No comments:

Post a Comment