Tuesday, March 22, 2011

జై తెలంగాణా - జై భోలో తెలంగాణా!

నాడు 'దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్' అన్నాడొక మహానుభావుడు. కాని నేడు 'రాష్ట్రమంటే రాతిబొమ్మలేనోయ్ రాలిపోయే ప్రాణులు కాదోయ్!' అని అంటున్నారు


వన్నెతగ్గని కుహనా ప్రజాస్వామిక, సాంస్కృతిక-సాహిత్య దురంధరులు. కూలిన విగ్రహాల గురించి నిరసనలు, నివాళులు, లెంపలేసుకోవడం మరియు పాలాభిషేకాలు చేసి కన్నీరు పెట్టుకోవడం కడు శోచనీయం. వారి దూషణలు మిక్కిలి గర్హనీయం. ఐదున్నర దశాబ్దాల దోపిడి, ఆరాచక మరియు నియంతృత్వపు వలసవాద పాలన నుండి విముక్తికై పోరాడుతూ,

తమ ప్రాణాలనే ఫణంగా పెట్టి మంటల్లో కాలి బూడిదవుతున్న ఆ త్యాగ మూర్తుల కంటే తమది కాని అన్య మూర్తుల ప్రాముఖ్యత సమయానికందిరాని ఆలోచన. పాలకుల తుపాకుల నుండి వర్షించే తూటాలు, ఇనుప బూట్ల తొక్కుల్లు మరియు లాఠీల విలయతాండవంతో నెత్తురోడి నేల రాలిన ఆ భావి కుసుమాల గురించి ఒక్క కన్నీటి చుక్క రాల్చి సానుభూతి తెలిపే, మానవత్వం మూర్తిభవించిన సాటి తెలుగువారలె లేకపోయిరి కదా! అణచివేతలతో, ఆధిపత్యపు ఆగడాలతో దెబ్బ తిన్న జీవుల కళ్ళలోంచి నీళ్ళకు బదులు

నిప్పులు, హృదయంలోంచి ప్రేమకు బదులు ద్వేషం పుడుతుందనే నగ్న సత్యం విజ్ఞులకు తెలియంది కాదు. దాని పర్యావసనమే ట్యాంక్ బండ్ ఘటనలు. ఇది గ్రహించక పుండు మీద కారం జల్లినట్లు ' అమానవీయమని, తెలుగు వారు తలదించు కోవాలని, దున్న పోతులూ సిగ్గు పడతాయని, చరిత్ర క్షమించదని, దోషులను ఉరి తీయాలని ఎన్నెన్నో సూక్తులు వినిపించారు కుహనా సంగీత-సాహిత్య-సాంస్కృతిక సామ్రాట్లు. మరి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని విశ్వ వ్యాప్తంగా చాటి చెప్పి అందుకు ప్రతీకగా నిలిచిన మహానుభావుడు కీ.శే. నందమూరి తారక రామారావు మీద చెప్పులు విసిరి అవమానం చేసిన నాడు ఈ తెలుగు జాతి ఎక్కడ విశ్రాంతి తీసుకుందో? ఆ దోషులను శిక్షించక పోగా నిసిగ్గుగా ఓట్లు వేసి రాజ్యాధికారాన్ని అప్పగించిన ఘనత మీకే చెల్లింది కాబోలు. చివరకు ఏ ఆదరణకు నోచుకోక కృశించి దిక్కులేని చావు చచ్చిన మాట వాస్తవం కాదా? ఇక మరో తెలుగు ముద్దు బిడ్డ కీ.శే. పి.వి. నరసింహారావు గారి మీద కర్నూల్ లో చెప్పులు విసిరి తమ తెలుగు సంస్కృతీ అభిమానాన్ని దశ దిశల చాటిన ఆ ఘనత మీకే సొంతం. అట్టి కార్యక్రమ వ్యూహ కర్తలకు శాపనార్థాలు, శిక్షలు ఉండకపోగా మంత్రులు-ముఖ్యమంత్రులను చేసి ఆనందపడిన చరిత్ర మీకు మాత్రమే వున్నది. ఇంతగా గొంతు చించుకుని, గుండెలు బాదుకునేవారు ఈ మధ్య బరంపురంలో జరిగిన తెలుగు మహాసభలో తెలంగాణ కవి నందిని సిద్దా రెడ్డి మీద భౌతిక దాడి జరిగినప్పుడు ఎందుకు ఖండించలేదు? ప్రసార సాధనాలు ఎందుకు వెలుగులోకి తీసుకురాలేదు?. అతను సిమాంధ్ర రాతిబొమ్మ పాటి విలువ చేయరు కాబోలు. ఇగ త్రివర్ణ పతాక సృష్టి కర్త పింగళి వెంకయ్య చరిత్ర తిరగవేస్తే మరీ దుర్భరం. ఆ దేశబక్తుడి ఆర్ధిక పరిస్థితి దిగజారిపోయి ఎలాంటి ఆదరణకు నోచుకోకుండా కడు పేదరికంతో కనుమూశాడు. అప్పుడు ఏలిన వారికిగాని, అనామకులను, అవినీతిపరులను ఆదుకుని సత్కరించే తెలుగు సంస్థలు గాని, సంఘాన్ని ఉద్దరించే ఆపన్న హస్తాలు ఎక్కడికి అదృశ్యం ఆయ్యాయో తెలియదు. మరో దారుణం ఏమిటంటే పింగళి వెంకయ్య కుమారుడు పింగళి దశరథరాం ఎందుకు చంపబడ్డాడు? ఎవరు చంపారు? దోషులు ఎలా మాయమయ్యిండ్రు? దీనిపైన ఈ తెలుగు జాతి గళం విప్పలేదెందుకు? ధర్నాలు, పోరాటాలు చెయ్యలేదేందుకు?

పాదిరికుప్పం, కారంచేడు మరియు చుండూరు హత్యలు గుర్రం జాషువా గౌరవార్థం జరిగినవేనా? ఈ కుహనా ప్రజాస్వామిక వాదులు, సాహితీ వేత్తలు తమ నిసిగ్గు ద్వంద ప్రమాణాలు ఇక నైనా మానడం

మంచిది. అంతెందుకు ఈ మధ్య రోశయ్య ముఖ్యమంత్రిగా పదవి చేపట్టగానే సీమాంధ్రలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాలు ఎన్ని ద్వంశం అయ్యయో చెప్పక్కర్లేదు మరి పెకిలిన గొంతులెన్ని? ఖండించిన ప్రజాసంఘాలేన్ని? ప్రశ్నించిన మానవతావాదులేరి?.ఆగడం చేస్తే జగడం ఆగదు సరికదా ఇంకా ఉదృతం అవుతుంది. పది సంవత్సరాల పసి బాలుడి నుండి పండు ముదుసలికి తప్పని బైన్దోవర్లు, కాలికి చెప్పులు లేకుండా రచ్చబండకు రమ్మనడం లేదంటే ఊర్ల దిగ్బంధనం, ఇండ్లు,బండ్లు,గొడ్డు గోదను తగులబెట్టడం ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా సోదరభావం? చావడానికి యావత్ తెలంగాణ సిద్దం అయ్యింది గాని భాష పేరుతో

బానిసత్వానికి, కులంపేరుతో కుటిల రాజకీయానికి

ఏ మాత్రం సహకరించడానికి సంసిద్దులుగాలేరనే నగ్న సత్యాన్ని వలస

పాలకులు గుర్తుంచుకోవాలి. లేదంటే ప్రజల కోపాగ్నికి

ఆహుతి గాక తప్పదు.నియంతల చరిత్రనుండి నిజాలు తెలుసుకుని

హుందాగా నిష్క్రమించడం ఉత్తముల లక్షణం.



"భక్తుడి కోపానికి భగవంతుడికే భంగపాటు తప్పలేదన్న సత్యం జగత్వ్యాపితం".



జై తెలంగాణా - జై భోలో తెలంగాణా!

No comments:

Post a Comment